Share News

Disability Pensions దివ్యాంగ పింఛన్ల పునఃపరిశీలన

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:41 PM

Reassessment of Disability Pensions జిల్లాలో దివ్యాంగ పింఛన్ల పునఃపరిశీలనకు రంగం సిద్ధమవుతుంది. మొత్తంగా 2,781 మందికి ఈ నెల 14 నుంచి తనిఖీలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నాలుగు వైద్య బృందాలు దివ్యాంగ పింఛన్‌దారుల తనిఖీలు చేపట్టాయి. 7,924 మంది వైకల్య శాతం, సదరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాయి. అయితే 2,781 మందికి పైగా వైకల్య శాతంలో లోపాలు ఉన్నట్లు గుర్తించి నివేదికలు అందించారు.

 Disability Pensions దివ్యాంగ పింఛన్ల  పునఃపరిశీలన

  • 2,781 మందికి తనిఖీలు

గరుగుబిల్లి, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దివ్యాంగ పింఛన్ల పునఃపరిశీలనకు రంగం సిద్ధమవుతుంది. మొత్తంగా 2,781 మందికి ఈ నెల 14 నుంచి తనిఖీలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నాలుగు వైద్య బృందాలు దివ్యాంగ పింఛన్‌దారుల తనిఖీలు చేపట్టాయి. 7,924 మంది వైకల్య శాతం, సదరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాయి. అయితే 2,781 మందికి పైగా వైకల్య శాతంలో లోపాలు ఉన్నట్లు గుర్తించి నివేదికలు అందించారు. దీంతో ఎంపీడీవోలు వారికి నోటీసులు జారీ చేశారు. కాగా పింఛన్లు నిలుపుదల చేస్తామనడంతో దివ్యాంగ పింఛన్‌దారులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ప్రభుత్వం యథావిధిగా అందరికీ పింఛన్లు పంపిణీ చేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. గతంలో నోటీసులందించిన దివ్యాంగ పింఛన్‌దారులను ఈ నెల 8 నుంచి కేటాయించిన ఆసుపత్రుల్లో తనిఖీలకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర సెర్ప్‌ ఉన్నతాధికారి ఎ.కల్యాణ్‌చక్రవర్తి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అప్పీలు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి ఆసుపత్రి కేటాయింపు, తేదీ, సమయాన్ని తెలియజేయాలన్నారు. అయితే బుధవారం నుంచి తనిఖీలు ప్రారంభమవ్వాల్సి ఉండగా.. జిల్లా ఉన్నతాధికారుల విన్నపం మేరకు ఈ ప్రక్రియను ఈనెల 14కు వాయిదా వేశారు.

వారంలో మూడు రోజులు..

జిల్లాలోని ప్రధాన ఆసుపత్రుల్లో బుధ, గురు, శుక్రవారాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. కంటికి సంబంధించి 20 మంది, లోకోవేటర్‌కు 30 మంది, దివ్యాంగ డిజోబుల్‌కు ఐదుగురు, వినికిడికి సంబంధించి 30 మంది, ఎంఆర్‌, ఎంఐకి గాను 20 మంది చొప్పున రోజుకు తనిఖీలు ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు తనిఖీలకు వెళ్లిన సమయంలో 104, 108 వాహనాలను ఏర్పాటు చేయాలని సెర్ప్‌ ఉన్నతాధికారి సూచించారు. కాగా సంబంధిత దివ్యాంగ పింఛన్‌ దారుల సమాచారాన్ని మ్యాపింగ్‌ చేయాల్సి ఉంది. పింఛన్‌దారులకు కేటాయించిన సమయం, ఆసుపత్రి సమాచారం ఎంపీడీవో కార్యాలయాలకు అందాల్సి ఉంది.

వైకల్య శాతం తక్కువగా ఉంటే..

85 శాతం పైబడిన వైకల్యం ఉన్న వారికి, మంచానికి పరిమితమైన వారికి రూ. 15 వేలు అందిస్తారు. 85 శాతం కంటే తక్కువ ఉండి 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి రూ. 6 వేలు, 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి 60 సంవత్సరాలు పైబడిన వారికి రూ. 4 వేలు ఇస్తారు. 60 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉంటే పింఛన్‌ తొలగిస్తారు. 40 శాతం కంటే అధికంగా వైకల్యం ఉన్నట్లయితే రూ. 6 వేలు అందిస్తారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి రూ. 4 వేలు వృద్ధాప్య పింఛన్‌కు మార్పు చేయనున్నారు. వయసు తక్కువగా ఉన్నట్లయితే పింఛన్‌ రద్దయ్యే అవకాశం ఉంది.

వైద్యులకు సమాచారం అందించాం

జిల్లాలో 2,781 మంది దివ్యాంగ పింఛన్ల పునఃపరిశీలనకు సంబంధించి వైద్యశాఖ అధికారులకు సమాచారం అందించాం. ఈ నెల 8 నుంచి పునః పరిశీలన జరగాల్సి ఉన్నా అనివార్య కారణాలతో 14 నుంచి నిర్వహిస్తాం. మండలాల వారీగా షెడ్యూల్‌ ఇవ్వాల్సి ఉంది. వినికిడికి సంబంధించి విజయనగరం ఆసుపత్రికి రిఫర్‌ చేయనున్నాం. మిగతా వారికి పార్వతీపురం, పాలకొండ ఆసుపత్రుల్లో తనిఖీలు జరగనున్నాయి.

- ఎం.సుధారాణి, పీడీ, డీఆర్‌డీఏ, పార్వతీపురం మన్యం

Updated Date - Oct 07 , 2025 | 11:43 PM