Share News

Real Dhamaal! రియల్‌.. ఢమాల్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:12 AM

Real Dhamaal! జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరు తగ్గింది. ఆశించిన స్థాయిలో భూములు, స్థలాల క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో రియల్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

Real Dhamaal! రియల్‌.. ఢమాల్‌
పాలకొండలో ఓ వెంచర్‌

గత వైసీపీ సర్కారు అనాలోచిత నిర్ణయాల ఎఫెక్ట్‌

ఎల్‌ఆర్‌ఎస్‌, వీఎల్‌టీతో ఇక్కట్లు

అమ్ముడుపోని భూమి, స్థలాలు

అప్పుల్లో రియల్టర్లు

రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు

పాలకొండ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరు తగ్గింది. ఆశించిన స్థాయిలో భూములు, స్థలాల క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో రియల్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నూతన జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పూలు.. ఆరు కాయలుగా ఉంటుందని రియల్టర్లు భావించారు. ఈ మేరకు కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టారు. అయితే వారి ఆలోచనలకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో రియల్టర్లు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం వారంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో రిజిస్ర్టేషన్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఎల్‌ఆర్‌ఎస్‌, ఈఎల్‌టీ, ఈ-స్టాపింగ్‌ తదితర వాటిని కూడా రద్దు చేసి రియల్‌ రంగాన్ని ఆదుకోవాలని రియల్టర్లు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- నూతన జిల్లాగా ప్రకటించిన తర్వాత పార్వతీపురం నలువైపులా నుంచి వచ్చిన వ్యాపారులు భారీ పెట్టుబడులు పెట్టి రహదారులకు ఇరువైపులా ఉన్న స్థలాలు, పొలాలను కొనుగోలు చేశారు. దీంతో అప్పటివరకు మామూలు ధర పలికిన భూములు, స్థలాల రేట్లు అమాంతం పెరిగాయి. అయితే అందుకు తగ్గట్టుగానే వ్యాపారాలు జరుగుతాయనే ఆలోచనలతో వ్యాపారులంతా సిండికేట్లుగా ఏర్పడ్డారు. ఎడాపెడా భూములు, ఖాళీ స్థలాలను కొనుగోలు చేశారు.

- పార్వతీపురం నుంచి 20 కిలోమీటర్ల వరకు, పాలకొండ-పార్వతీపురం ప్రధాన రహదారి, పాలకొండ-రాయగడ ప్రధాన రహదారి, పార్వతీపురం-బొబ్బిలి రహదారితో పాటు సాలూరు తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయలతో పొలాలు, భూములు కొనుగోలు చేశారు. రహదారికిరువైపులా విస్తరించి ఉన్న వ్యవసాయ భూములను కొనుగోలు చేసి లక్షల రూపాయలు వెచ్చించి వెంచర్లను సిద్ధం చేశారు.

వైసీపీ అడ్డగోలు తీరుతో...

- వైసీపీ ప్రభుత్వం అడ్డుగోలు వ్యవహారంతో రియల్‌ వ్యాపారం మందగించింది. 2021లో ఎల్‌ఆర్‌ఎస్‌( ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)ను ప్రవేశపెట్టింది. సదరు వెంచర్లలో కొంత స్థలాన్ని ప్రభుత్వానికి రిజిస్ర్టేషన్‌ చేసేలా చర్యలు చేపట్టింది. 20 ఏళ్ల కిందట వెంచర్లు వేసిన వారు సైతం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంతోనే భవన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రియల్టర్లకు చెందిన ప్లాట్లు అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. కాగా అంతకు ఆరు నెలల ముందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రిజిస్ర్టేషన్లకు సంబంధించి సర్వర్‌ను నిలుపుదల చేశారు.

- 2023లో వీఎల్‌టీ (వేకండ్‌ ల్యాండ్‌ టాక్స్‌ను)ని భూమి, స్థల యజమానులపై వైసీపీ ప్రభుత్వం రుద్దింది. నూతన లేఅవుట్‌ వేయాలంటే సవాలక్ష నిబంధనలను పెట్టింది. దీంతో వ్యాపారులు లేఅవుట్‌లు వేయలేక వీఎల్‌టీ, ఎల్‌ఆర్‌ఎస్‌తో ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో భూములు, స్థలాల క్రయ, విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత చర్యలు, అప్పటి అధికార యంత్రాంగం అత్యుత్సాహం కారణంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తల కిందులైంది. కోట్లాది రూపాయలతో పెట్టుబడులు పెట్టి వందల ఎకరాలు కొనుగోలు చేసిన రియల్టర్లు తలలు పట్టుకుంటున్నారు. వారిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వందలాది మంది ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భూమి, స్థలం అమ్ముకుందామని కొందరు ముందుకొస్తున్నప్పటికీ కొనుగోలు చేసే వారే కరువయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన రహదారి పక్కన ఎకరా భూమిని సుమారు రూ.5 కోట్లుకు కొనుగోలు చేస్తే ప్రస్తుతం దానిని రూ.మూడు కోట్లకు కూడా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

- సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్లకు అనుమతి ఇవ్వడం, ఈ-స్టాంపుల విధానంతో ప్రజలను తికమక పెట్టడం వంటి వాటితో కొనుగోలుదారులు, అమ్మకందారులు విసుగుచెందారు.

- జిల్లాలో గతంలో వివిధ రకాలైన భవనాలు, ఇతరత్రా రిజిస్ర్టేషన్లు 80 నుంచి 100 వరకు జరిగేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 50 నుంచి 40కి పడిపోయింది. జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఆదాయం గణనీయంగా తగ్గింది.

- దీనిపై ఓ అధికారిని (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) వివరణ కోరగా.. గతంలో పోల్చుకుంటే జిల్లాలో రిజిస్ర్టేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం భవనాలు, ఇతరత్రా చిన్నపాటి రిజిస్ర్టేషన్లే అవుతున్నాయి. స్థలాలు, భూముల రిజిస్ర్టేషన్లు పూర్తిగా జరగడం లేదని తెలిపారు.

Updated Date - Jun 11 , 2025 | 12:12 AM