Rabi Season రబీకి సన్నద్ధం
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:16 AM
Ready for Rabi Season జిల్లా రైతులు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా 56,060 ఎకరాల్లో పలు రకాల పంటలు పండించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో 5,100 ఎకరాల్లో వరి 14,587 ఎకరాల్లో మొక్కజొన్న, 142.5 ఎకరాల్లో రాగి , 8367.5 ఎకరాల్లో పెసర , 18,880 ఎకరాల్లో మినుములు, 775 ఎకరాల్లో ఉలవలు, 472.5 ఎకరాల్లో వేరుశనగ, 7,445 ఎకరాల్లో నువ్వులు సాగు చేయనున్నారు.
విత్తనాలు, ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు
పార్వతీపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా 56,060 ఎకరాల్లో పలు రకాల పంటలు పండించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో 5,100 ఎకరాల్లో వరి 14,587 ఎకరాల్లో మొక్కజొన్న, 142.5 ఎకరాల్లో రాగి , 8367.5 ఎకరాల్లో పెసర , 18,880 ఎకరాల్లో మినుములు, 775 ఎకరాల్లో ఉలవలు, 472.5 ఎకరాల్లో వేరుశనగ, 7,445 ఎకరాల్లో నువ్వులు సాగు చేయనున్నారు. రబీ రైతులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు మరోవైపు జిల్లా వ్యవసాయ శాఖ సర్వం సిద్ధం చేసింది. వారికి అవసరమైన విత్తనాలతో పాటు ఎరువులు తదితర వాటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా జిల్లాలో కొన్ని ప్రాజెక్టుల నుంచే రబీ పంటలకు సాగు నీరు విడుదల చేయనున్నారు. వీఆర్‌ఎస్, పెద్దగెడ్డ తదితర జలాశయాల నుంచి నీరు సరఫరా చేసే అవకాశం లేకపోవడంతో ఏటాలానే ఈ రబీ సీజన్‌లో కూడా వరి కంటే మొక్కజొన్న, పెర, మినుములు, నువ్వులను అధికంగా పండించేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
2,852 క్వింటాళ్ల విత్తనాలు అవసరం
- రబీ కాలానికి సంబంధించి జిల్లాకు 2,852 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఇందులో వరి విత్తనాలు పాడి ఎంటీయూ 1121 రకం 110 క్వింటాళ్లు, పాడి ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం విత్తనాలు 85 క్వింటాళ్లు , మినుముల విత్తనాలు 410 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 841 క్వింటాళ్లు, నువ్వులు 18 క్వింటాళ్లు, రాగి 10 క్వింటాళ్లు, అవసరం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 181.66 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి మరికొద్ది రోజుల్లో జిల్లాకు రానున్నట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
- గత రబీ సీజన్‌లో 1,474 క్వింటాళ్ల విత్తనాలను 4,614 మంది రైతులకు అందించారు. ఇందులో 859 క్వింటాళ్లు 90 శాతం రాయితీపై పంపిణీ చేశారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో రైతులకు సబ్సిడీపై 2,920 క్వింటాళ్ల విత్తనాలు అందించనున్నారు. ఇందులో వరి 205 క్వింటాళ్లు, మిల్లెట్స్ 12 క్వింటాళ్లు, పిచ్చిరొట్ట విత్తనాలు 611 క్వింటాళ్లు, మినుములు 828 క్వింటాళ్లు, పెసర 361 క్వింటాళ్లు , వేరుశనగ 841 క్వింటాళ్లు, ఉలవలు 30 క్వింటాళ్లు, నువ్వులు 18 క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. 1237 క్వింటాళ్ల విత్తనాలను గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై సరఫరా చేయనున్నారు. దీనిపై జిల్లా వ్యవసాయ శాఖాధికారి అన్నపూర్ణను వివరణ కోరగా.. ‘రబీ కాలంలో రైతులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉంది. సబ్సిడీపై అర్హులైన రైతులకు విత్తనాలు అందిస్తాం. అధిక దిగుబడి సాధించేందుకు అవసరమైన సలహా, సూచనలు అందిస్తాం. ’ అని తెలిపారు.