Ready for “mustabu” ‘ముస్తాబు’కు సిద్ధం
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:47 PM
Ready for “mustabu” రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని విద్యాలయాల్లో నేటి నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కొద్దిరోజుల కిందట మంత్రి సంధ్యారాణి సాలూరు మండలం కొత్తవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్ ఆదేశాలతో ఈ వినూత్న కార్యక్రమం నిర్వ హణకు సంబంధించి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహణ
విద్యార్థుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ పెంపే లక్ష్యం
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అమలుకు చర్యలు
పార్వతీపురం, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని విద్యాలయాల్లో నేటి నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కొద్దిరోజుల కిందట మంత్రి సంధ్యారాణి సాలూరు మండలం కొత్తవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్ ఆదేశాలతో ఈ వినూత్న కార్యక్రమం నిర్వ హణకు సంబంధించి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యా ర్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా ‘ముస్తాబు’ అమలు చేయనున్నారు.
ఇదీ పరిస్థితి..
‘ముస్తాబు’లో భాగంగా విద్యార్థులు తమ చేతులు, ముఖం పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు గోర్లు పెరగకుండా చూడాలి. శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. జట్టును సరిగా దువ్వుకోవాలి. దీనివల్ల వారు వ్యాధులు బారిన పడకుండా ఉంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడతారు. శారీరక, మానసిక ఉత్సాహం పెరుగుతుంది. ఆలోచన విధానం కూడా మారుతుంది. ఏకాగ్రతతో చదవగలుగుతారు. పాఠశాల పరిశుభ్రతలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.
ముస్తాబు కార్నర్...
ప్రతి తరగతి గదిలో ఉపాధ్యాయులు ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. అద్దం, టవల్, దువ్వెన, సబ్బు, పౌడర్, కాటుక బొట్టు, నెయిల్‌కట్టర్, హ్యాండ్‌వాష్ , నీరు అందుబాటులో ఉంచుతారు. పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు రోజువారి లీడర్ వ్యవస్థ ఉంటుంది. తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వారిని లీటర్లు తనిఖీ చేస్తారు. పరిశుభ్రతలో విఫలమైన విద్యార్థులతో అక్కడే ముఖం కడిగిస్తారు. తల దువ్వుకునే అవకాశం ఇస్తారు. అనంతరం తరగతిలోని అనుమతి ఇస్తారు. భోజనానికి ముందు కూడా చేతులు పరిశు భ్రత తనిఖీ చేస్తారు. ప్రతి వారం పాఠశాలల్లో పరిశుభ్రత అంశాల్లో ముందుండే విద్యార్థులను ముస్తాబు స్టార్‌గా గుర్తించి సత్కరిస్తారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాల, లీడర్ అవార్డులు ఇస్తారు. లీడర్ల పనిని టీచర్లు గమనించి ప్రశంసించాలి. వారానికి ఒకసారి ఉత్తమ లీడర్లు, ముస్తాబు స్టార్స్‌ను గుర్తించి సర్టిఫికెట్ ఇవ్వాలి.
ఆరోగ్య పరిరక్షణకు దోహదం
‘రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో ‘ముస్తాబు’ నిర్వహిస్తున్నాం. గిరిజన విద్యార్థుల్లో ఆరోగ్య పరిరక్షణకుఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. చిన్న వయసులోనే వారికి శుభ్రతపై అవగాహన ఏర్పడుతుంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
విజయవంతంగా నిర్వహించాలి
జిల్లాలో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమం అమలుపై హెచ్‌ఎంలు, టీచర్లకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, బాధ్యత పెంపొందించడంలో ‘ముస్తాబు’ ఎంతగానో దోహదపడు తుంది. వ్యక్తిగత పరిశుభ్రతతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఉదయం సూర్య నమస్కారాలు, సాయంత్రం ఆటలు తప్పనిసరి.. ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశా లల్లోనూ అమలు చేయాలి. ప్రతి వారం పరిశుభ్రత పాటిస్తున్న విద్యార్థికి గుర్తింపు ఇవ్వాలి. తద్వారా విద్యార్థుల్లో పరిశుభ్రతపై మరింత ఆసక్తి పెంచాలి. ’ అని తెలిపారు.