Mega PTM మెగా పీటీఎం నిర్వహణకు సన్నద్ధం
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:10 AM
Ready for Mega PTM మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం)కు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూడోసారి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు రానున్నారు. భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించనున్న పీటీఎంలో పాల్గొనున్నారు. దీంతో జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా నాలుగో తేదీన రానున్న నేపథ్యంలో భామినితో పాటు జిల్లాలోని మిగతా పాఠశాలల్లోనూ పీటీఎం నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
పాఠశాలల్లో ఏర్పాట్లు
భామినిలో సమావేశానికి హాజరుకానున్న సీఎం
ముందురోజే రానున్న మంత్రి లోకేశ్
పార్వతీపురం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం)కు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూడోసారి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు రానున్నారు. భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించనున్న పీటీఎంలో పాల్గొనున్నారు. దీంతో జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా నాలుగో తేదీన రానున్న నేపథ్యంలో భామినితో పాటు జిల్లాలోని మిగతా పాఠశాలల్లోనూ పీటీఎం నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. 2024, డిసెంబరు 7న, 2025 జూలై 10న జిల్లాలో పీటీఎంలు జరిగాయి. తాజాగా శుక్రవారం మూడోసారి సమావేశం చేపట్టేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.
సమావేశం ఇలా..
ఈనెల 5న ఉదయం 9గంటల నుంచి 9.30 గంటల మధ్యలో విద్యార్థులు, వారి తల్లిదం డ్రులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సేవ కులు పాఠశాలలకు హాజరవుతారు. 10.50 గంటల వరకు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను ఉపాధ్యాయులు వివరిస్తారు. బోధనలో అవలంబిస్తున్న నూతన విధానాలను వీడియో రూపంలో ప్రదర్శిస్తారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే సమావేశంలో పిల్లల ప్రగతి నివేదికలు అందిస్తారు. ఇళ్లు, పాఠశాలల్లో విద్యార్థుల నడవడిక, వారి ప్రవర్తన, చదివే తీరు, పరీక్షల్లో మార్కులు, నైపుణ్యాలు తదితర అంశాలను చర్చిస్తారు.
టెన్త్ పరీక్షల సన్నద్ధతపై చర్చ
టెన్త్ ఫలితాల్లో జిల్లా వరుసగా మూడుసార్లు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా మొదటి స్థానం సాధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు వందరోజుల ప్రణాళికను రూపొందించారు. ఈ వంద రోజుల్లో విద్యార్థులు ఏ విధంగా టెన్త్ పరీక్షలకు సిద్ధం కావాలి. ఎలా చదవాలి.. తదితర అంశాలను ప్రత్యేకంగా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో చర్చించనున్నారు.
నిధుల సమస్య
మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకు నిధుల సమస్య వెంటాడుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణకు కొంతమంది ఉపాధ్యాయులు తమ సొంత నగదును వెచ్చించాల్సి వస్తుంది. వాస్త వంగా పాఠశాలలకు నిర్వహణకు విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు మంజూరవుతాయి. వాటితో పీటీఎం నిర్వహించొచ్చు. కానీ ఆ నిధులు పాఠశాల నిర్వహణకే సరిపోవడం లేదు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం రోజున భోజనాలు , స్నాక్స్ , టెంట్లు ఏర్పాటుకు కనీసం రూ.ఐదు వేల నుంచి రూ.8 వేల వరకు అవసరం. ఈ మొత్తాన్ని ఉపాధ్యాయులు భరించాల్సి వస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరూ రూ. 500 నుంచి రూ.1000 వేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.