Share News

Ration from depots ఇక డిపోల నుంచే రేషన్‌

ABN , Publish Date - May 31 , 2025 | 11:06 PM

Ration from depots రేషన్‌ లబ్ధిదారులు ఇక నుంచి డిపోల నుంచి నిత్యావసరాలు అందుకోనున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ పాత విధానంలో సరుకులు తీసుకోనున్నారు. కొత్త విధానాన్ని బొండపల్లి మండలం గిట్టుపల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం ప్రారంభిస్తారు.

Ration from depots ఇక డిపోల నుంచే రేషన్‌

ఇక డిపోల నుంచే రేషన్‌

నేటి నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ

సిద్ధం చేసిన అధికారులు

బొండపల్లి మండలం గిట్టుపల్లిలో ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం కలెక్టరేట్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ లబ్ధిదారులు ఇక నుంచి డిపోల నుంచి నిత్యావసరాలు అందుకోనున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ పాత విధానంలో సరుకులు తీసుకోనున్నారు. కొత్త విధానాన్ని బొండపల్లి మండలం గిట్టుపల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి రేషన్‌ డిపోలను సిద్ధం చేశారు. ఇప్పటికే సివిల్‌ సప్లయ్‌ అధికారులు డిపోలను తనిఖీ చేశారు. ఒకటో తేదీ నుంచి 15 వరకూ సరుకులు అందజేయనున్నారు. ఉదయం 8 నుంచి 12 వరకూ, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ డీలర్లు అందుబాటులో ఉంటారు. ఎండీయూల వద్ద ఉండే ఈ-పాస్‌ మిషన్లు, సాఫ్ట్‌వేర్‌ను డీలర్లకు చెందిన ఈ-పాస్‌ మిషన్లకు ఇప్పటికే అనుసంధానం చేశారు. డిపోల వద్ద ధరలు పట్టిక కూడా ఏర్పాటు చేశారు. ప్రతి డిపో వద్ద డీలరు ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ తోపాటు తూనికల కొలతలు ధ్రువీకరించిన పత్రం కూడా ఉండేలా నిర్దేశించారు. డిపోలను తనిఖీ చేసేందుకు జిల్లాకు ప్రత్యేకాధికారి ఎంవీ ప్రసాద్‌ను నియమించారు.

205 డిపోల వద్ద మహిళా సంఘాలు

జిల్లా వ్యాప్తంగా 1249 రేషన్‌ డిపోలు ఉండగా 205 డిపోలకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా సరుకులు ఇవ్వనున్నారు. మిగిలిన వాటిలో డీలర్ల ద్వారా అందిస్తారు. జిల్లాలో 5,71,240 రేషన్‌ కార్డులు ఉన్నాయి. గంట్యాడ మండలం అడ్డతీగ, వేపాడ మండలంలోని కేజీ పూడి, మెంటాడ మండలంలోని కూనేరు ,కొండపర్తి గ్రామాల్లో ఉన్న డిపోల్లో ఆఫ్‌లైన్‌లో అందిస్తారు. మిగిలిన 1245 డిపోల్లో ఈ-పాస్‌ ద్వారా సరుకులు ఇస్తారు. లబ్ధిదారులకు బియ్యం, పంచదార అందిస్తారు. బియ్యం ఉచితంగా ఇవ్వగా, పంచదార ఏఏవై కార్డులకు కిలో రూ.13.50కు, తెల్లకార్డుదారులకు అరకేజి రూ.17కు అందిస్తారు.

వృద్ధులు, దివ్యాంగుల ఇంటివద్దకే..

జిల్లాలో 65 సంవత్సరాలు పైబడి ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే డీలర్లు సరుకులు అందిస్తారు. ఇటువంటివి జిల్లాలో 65,912 కార్డులు ఉన్నాయి. బాడంగిలో 2057 కార్డులు, భోగాపురంలో 1652 , బొబ్బిలిలో 4118, బొండపల్లిలో 1963, చీపురుపల్లిలో 1848, దత్తిరాజేరులో 2223, డెంకాడలో 1866, గజపతినగరంలో 1997, గంట్యాడలో 2855, గరివిడిలో 2344, గుర్లలో 2252, జామిలో 2417, కొత్తవలసలో 1756, ఎల్‌.కోటలో 2144, మెంటాడలో 1763, మెరకముడిదాంలో 2312, నెల్లిమర్లలో 2493, పూసపాటిరేగలో 2286,రాజాంలో 2973, రామభద్రపురంలో 1708, రేగిడిలో 2951, సంతకవిటిలో 3118, ఎస్‌.కోటలో 2257, తెర్లాంలో 2803,వంగరలో 2080,వేపాడలో 1993, విజయనగర రూరల్‌లో 5672, విజయనగరం 37 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులు అందరికి ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేస్తారు.

అక్రమాలకు పాల్పడితే క్యూఆర్‌ కోడ్‌తో ఫిర్యాదు

రేషన్‌ డీలర్లు అక్రమాలకు పాల్పడినా , సరుకులు సక్రమంగా ఇవ్వకపోయినా, తూకంలో తేడా ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయడానికి డిపోల వద్ద క్యూఆర్‌ కోడ్‌తో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.ఈ బోర్డుపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌; పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఫొటోలు ఉన్నాయి. మొబైల్‌ ద్వారా స్కాన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కూపన్‌పై జిల్లా పౌర సరఫరాల అధికారి, తహసీల్దార్‌ నెంబర్లు రాసి ఉంటాయి. వీరికి కూడా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

నాలుగు ఏఎస్‌వో పోస్టులు ఖాళీ

గత ఐదేళ్లూ ఎండీయూలు ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో సివిల్‌ సప్లయ్‌ అధికారులకు పెద్దగా పని ఉండేది కాదు. ఇప్పుడు డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న నేపధ్యంలో డీపోలపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. అయితే ఏఎస్‌వో పోస్టులు కొన్నిచోట్ల ఖాళీగా ఉన్నాయి. గత నాలుగు ఏళ్లు ఈ పోస్టులను భర్తీ చేయలేదు. జిల్లాలో కేంద్రంలో ఉన్న ఏఎస్‌వో పోస్టుతో పాటు మూడు డివిజన్‌లో మూడు ఏఎస్‌వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అంతా సిద్ధం చేశాం

జిల్లాలోని అన్ని రేషన్‌డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేయడానికి అంతా సిద్ధం చేశాం. డిపోలను తనిఖీ చేశాం. ప్రతి రోజు డీలరు ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి 8 గంటలు వరకూ డిపో వద్ద ఉండి సరుకులు ఇవ్వాలి. ప్రతి నెల మొదటి నుంచి 15 తేదీ వరకూ సరుకులు అందజేయాలి. కార్డుదారులకు సరుకులు అందకపోయినా? తూకంలో తేడా ఉన్నా? అనుకున్న సమయంలో డిపోలు తెరవకపోయినా నేరుగా డిపో వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అక్కడ ఉన్న నెంబర్లుకు కూడా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

మధుసూధనరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి

Updated Date - May 31 , 2025 | 11:06 PM