Share News

ఇక డిపోల నుంచే రేషన్‌

ABN , Publish Date - May 22 , 2025 | 12:22 AM

ఇకనుంచి రేషన్‌ సరుకులను డిపోల ద్వారానే పంపిణీ చేయనున్నారు.

ఇక డిపోల నుంచే రేషన్‌

-ఎండీయూ వ్యవస్థ రద్దు

- దివ్యాంగులు, వృద్ధులకు మాత్రం ఇంటికే సరుకులు

- జూన్‌ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం

- జిల్లాలో 2,81,251 కార్డులు

పార్వతీపురం, మే 21 (ఆంధ్రజ్యోతి): ఇకనుంచి రేషన్‌ సరుకులను డిపోల ద్వారానే పంపిణీ చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (రేషన్‌ వాహనాలు) వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. జూన్‌ 1 నుంచి డిపోల ద్వారా రేషన్‌ సరుకులను అందించేందుకు నిర్ణయించింది. దివ్యాంగులు, వృద్ధులకు మాత్రం వారి ఇంటికే సరుకులు అందించనున్నారు.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో మొత్తం 2,81,251 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో తెలుపుకా ర్డులు 2,25,312, అంత్యోదయ కార్డులు 55,939, రేషన్‌ డిపోలు 578 ఉన్నా యి. ఈ కార్డులకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన 196 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తున్నారు. వాస్తవానికి ఇంటింటికీ రేషన్‌ను అందిస్తామని చెప్పి ఆ వాహనాలను ప్రారంభించారు. అయితే, వాటిని వీధి చివరు లేదా ఊరు చివరిలో నిలిపివేసి అక్క డకు లబ్ధిదారులను పిలిచి రేషన్‌ సరుకులను అందిస్తున్నారు. నెలలో ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు మాత్రం అత్యధికంగా ఈ వాహనాలు పనిచేస్తున్నాయి. మిగిలిన రోజుల్లో ఆ వాహనాలను సంబంధిత యాజమానులు తమ సొంత పనులు కోసం వినియో గించుకుంటున్న పరిస్థితి జిల్లాలో అత్యధిక శాతం ఉంది. బియ్యం అక్రమ రవాణాకు కూడా ఈ వాహనాలను వినియోగించేవారు. దీనివల్ల చాలామందికి రేషన్‌ సరుకులు అందేవి కావు. ఎండీయూ ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసింది. జూన్‌ 1నుంచి డిపోల ద్వారానే రేషన్‌ సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దివ్యాంగులు, 65ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇబ్బందులు లేకుండా వారి ఇంటికే సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది.

గిరిజన ప్రాంతాలపై దృష్టిసారించాలి..

గిరిజన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు సక్రమంగా అందే విధంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని చాలా గిరిజన గ్రామాల్లో రేషన్‌ డిపోలు లేవు. వీరంతా కొండలు దిగి సమీప మైదాన ప్రాంతాల్లోని డిపోలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బందులు తప్పవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ చేయడం లేదా డిపోల ద్వారానే సక్రమంగా ప్రతి లబ్ధిదారునికి సరుకులు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 22 , 2025 | 12:22 AM