Share News

ఆత్మలకు రేషన్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:17 AM

చనిపోయిన వారి పేరిట ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించిన ఘటనలు జిల్లాలో చాలానే వెలుగుచూశాయి.

 ఆత్మలకు రేషన్‌

-కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు

- ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా..

-ప్రతి నెలా సరుకులు తీసుకుంటున్న వైనం

- ఈకేవైసీతో తొలగింపునకు ప్రభుత్వం చర్యలు

- మరో ఐదు రోజులే గడువు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): చనిపోయిన వారి పేరిట ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించిన ఘటనలు జిల్లాలో చాలానే వెలుగుచూశాయి. అదే మాదిరిగా రేషన్‌ విషయంలో కూడా జరుగుతోంది. మరణించిన వారిపేర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, వలస వెళ్లిన వారు, పెళ్లిచేసుకుని అత్తారిళ్లకు వెళ్లిపోయిన ఆడపిల్లల పేర్లు రేషన్‌కార్డుల్లో దర్శనమిస్తోన్నా యి. కార్డుల్లో వారిపేర్లను తొలగించకపోవడంతో ప్రతినెలా రేషన్‌ సరుకులను సంబంధిత కుటుంబీకులు తీసుకుంటున్నారు.

జిల్లాలో పరిస్థితి

పార్వతీపురం మన్యం జిల్లాలో 2,81,251 రేషన్‌కార్డులున్నాయి. వీటిలో తెలుపుకార్డులు 2,25,312, అంత్యోదయం కార్డులు 55,939 ఉన్నాయి. వీటికి ప్రతి నెల 5,215 టన్నులకు పైబడి బియ్యం, ఇతర సరుకులను పంపిణీ చేస్తున్నారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో చాలామంది అనర్హులు రేషన్‌ సరుకులు పొందుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు సైతం రేషన్‌కార్డుల్లో నిరుపేదలుగా ఉండి రేషన్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇళ్లు తదితర పథకాల లబ్ధి పొందుతున్నారు. వైసీపీ పాలనలో రేషన్‌కార్డులు, పింఛన్ల విషయంలో వలంటీర్లు ఆడిండే ఆట, పాడిందే పాటగా ఉండేది. వలంటీర్లు తలచుకుంటే అనర్హులకు రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు మంజూరయ్యేవి. కార్డులో ఉన్న వ్యక్తి మరణించినా, పెళ్లి చేసుకొని ఆడపిల్లలు అత్తారిళ్లకు వెళ్లిపోయినా, ప్రభుత్వ ఉద్యోగం పొందినా, శాశ్వతంగా వలస వెళ్లినా అలాంటి వారి పేర్లను తొలగించాల్సి ఉంది. ఈ ప్రక్రియను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అనర్హులు రేషన్‌ పొందుతుంటే తొలుత డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు గుర్తించి అధికారులు దృష్టికి తీసుకెళ్లి కార్డు నిలుపుచేయాల్సి ఉంది. కానీ, తమకెందుకు అని వారు మిన్నకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక పింఛనుదారుడు ఎవరైనా మరణిస్తే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నప్పుడు ఆ వివరాల ప్రకారం వారి పేర్లను తొలగిస్తున్నారు. కానీ, రేషన్‌కార్డుల్లో మాత్రం వారు పేర్లు కొనసాగుతున్నాయి.


పక్కదారి పడుతున్న రేషన్‌

జిల్లాలో రేషన్‌ బియ్యం చాలా వరకు పక్కదారి పడుతున్నాయి. కొందరు డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు, చిల్లర వర్తకులు ఈ దందాను సాగిస్తున్నారు. కార్డుదారుల నుంచి కేజీ బియ్యం రూ.14 నుంచి రూ.16 వరకు కొనుగోలు చేసి రీస్లైకింగ్‌కు తరలిస్తున్నారు. సాలూరులో కొనుగోలు చేసిన బియాన్ని నేరేళ్లవలస మీదుగా ఒడిశాకు తరలిస్తున్నారు. జిల్లాలో 2022లో రూ.23.72 లక్షలు, 2023లో రూ.32.44 లక్షలు, 2024లో రూ.14.77 లక్షల విలువైన రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారు.

పారదర్శకతకు ప్రభుత్వం చర్యలు

రేషన్‌ పంపిణీలో పారదర్శకతకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. నిజమైన పేదలకే పథకాలు అందించేందుకు చర్యలు చేపడుతుంది. ఇప్పటికే అనర్హుల పింఛన్ల విషయంపై పరిశీలన చేయించింది. రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న నేపథ్యంలో ఈకేవైసీని గత నెల 17 నుంచి ప్రారంభించింది. ఈ ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. ఈకేవైసీ చేయించడానికి డీలర్లకు ప్రభుత్వం లాగిన్‌ ఇచ్చింది. ఐదేళ్లలోపు పిల్లలు, 84 ఏళ్లు పైబడిన వారికి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 2,81,251 లక్షల రేషన్‌కార్డుల్లో 8,16,859 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 12,053 మంది ఐదేళ్లు లోపు పిల్లలు, 665 మంది 84 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉన్నారు. వారికి ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంది. మిగిలిన 8,04,141 మందిలో ఇప్పటి వరకు 7.55 లక్షల మందికి పైబడి ఈకేవైసీ పూర్తయ్యింది. మరో 49 వేల మందికి పైగా ఈకేవైసీ చేయాల్సి ఉంది. సాలూరు అర్బన్‌, రూరల్‌లో అధికంగా ఏడు వేల మందికి పైబడి ఈకేవైసీ చేయాల్సి ఉంది. మరో ఐదు రోజులే గడువు ఉండడంతో ఈకేవైసీ పూర్తి చేయించడానికి పౌరసరఫరాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈకేవైసీ పూర్తి చేయిస్తాం

సాలూరు అర్బన్‌, రూరల్‌లో ఈ నెలాఖరుకల్లా ఈకేవైసీ పూర్తి చేయిస్తాం. ఇప్పటికే రేషన్‌కార్డుల్లో ఉన్న 84 వేల మంది సభ్యుల ఈకేవైసీ పూర్తి చేయించాం. ఇంకా ఏడు వేల మందికి పైగా సభ్యుల ఈకేవైసీ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయిస్తాం.

-రంగారావు, సివిల్‌సప్లయి డిప్యూటీ తహసీల్దార్‌, సాలూరు

Updated Date - Apr 26 , 2025 | 12:17 AM