Ration నేటి నుంచి డిపోల వద్దే రేషన్
ABN , Publish Date - May 31 , 2025 | 11:33 PM
Ration Available at Depots Starting Today ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రేషన్ డిపోల వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ జరగనుంది. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్డుదారులు తమ సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు.
పార్వతీపురం/సాలూరు రూరల్, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రేషన్ డిపోల వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ జరగనుంది. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్డుదారులు తమ సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు. జిల్లాలో 2,76,880 రేషన్‌కార్డులున్నాయి. ఏఏవై కార్డులు 54,930 ఉన్నాయి. ఇప్పటి వరకు వాటికి 196 ఎండీయూల ద్వారా సరుకులందించేవారు. ఇకపై 578 రేషన్ డిపోల ద్వారా సరుకులం దించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో 101 డీఆర్ డిపోలున్నాయి. కొత్త విధానంలో డీఆర్ డిపోలు బలోపేతం కానున్నాయి. బియ్యంతో పాటు ఇతర సరుకులు అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. ప్రతి నెలా జిల్లాలో 5 వేల టన్నుల బియ్యం, 166 టన్నుల పంచదార అందించనున్నారు.
ఏ డీలర్ వద్ద అయినా..
కార్డుదారు నమోదైన రేషన్ షాపు వద్దే కాకుండా సమీపంలో ఉన్న ఏ డీలర్ వద్దయినా సరుకులు తీసుకోవచ్చు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఆదివారాలతో సహా డీలర్లు సరుకులందించాలి. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులందించాలి. సరుకులు పంపిణీ పారదర్శకంగా ఉండేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. జిల్లా పౌరసరఫరాల అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు రేషన్‌డిపోలను తనిఖీ చేయాలి. లోకేషన్, డీలర్ పేరు, సరుకుల వారీగా నిల్వలు, ఈపోస్, కాటా, తూకం కచ్చితంగా ఉన్నది లేనిది తదితర అంశాలు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా ఒకటో తేది నుంచి ఐదో తేదీ నాటికి ఒంటరి దివ్యాంగులు, 65 పైబడిన వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డీలర్లు తమ షాపులో ఆర్డీవో, తహసీల్దారు, సీఎస్‌డీటీ, పౌరసరఫరాలశాఖ, తూనికలు కొలతలు తదితర అధికారుల ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలి.
నిరంతర పర్యవేక్షణ
జూన్ ఒకటి నుంచి రేషన్‌షాపుల్లో నిత్యావసర సరుకులు అందిస్తున్న నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. కార్డుదారులకు సక్రమంగా సరుకులందించాలి. అధికారుల తనిఖీల్లో ఎక్కడైనా అక్రమాలు వెలుగు చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- రాజేశ్వరి, మేనేజర్, ప్రజాపంపిణీ సంస్థ