rain effect వర్షంలో వరి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:30 AM
rain effect వరి పంట కోతలు చేపట్టిన రైతులు, కోతలు పూర్తయిన వారు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వానకు కలవరపడుతున్నారు. చిరు జల్లులైనప్పటికీ విరామం లేకుండా కురుస్తుండడంతో పంట సంరక్షణ చేయలేకపోతున్నారు
వర్షంలో వరి
సంరక్షించుకునేందుకు అవస్థలు పడుతున్న రైతులు
విరామం లేకుండా కురుస్తున్న చిరుజల్లులు
విజయనగరం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): వరి పంట కోతలు చేపట్టిన రైతులు, కోతలు పూర్తయిన వారు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వానకు కలవరపడుతున్నారు. చిరు జల్లులైనప్పటికీ విరామం లేకుండా కురుస్తుండడంతో పంట సంరక్షణ చేయలేకపోతున్నారు. తుఫాన్ తీరం దాటడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. సోమవారం రోజంతా కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతు న్నాయి. ఈ చినుకులతో చాలా చోట్ల వరి పనలు తడిచిపోయాయి. దీంతో రైతులకు టెన్షన్ పట్టుకుంది. ధాన్యానికి మొలక వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరి చేనుకుప్పలను సంరక్షించడం, నూర్పుచేసిన ధాన్యాన్ని కల్లాల్లో సంరక్షించడం వంటివి చేస్తున్నారు. ఏటా వరి కోతల సమయంలో ఈ పరిస్థితి తప్పడం లేదు. గత నెలలో మొంథా తుఫాన్ కూడా అన్నదాతలను కలవరపెట్టింది. అప్పట్లో భారీ వర్షాలు పడినా ఈదురుగాలులు లేవు. ఆపై పంట పక్వానికి వచ్చే సమయం కావడంతో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇప్పుడు సరిగ్గా వరి కోతలు, నూర్పుల సమయం. చిరుజల్లులే అయినా నష్టం తెచ్చేలా ఉన్నాయని భయపడుతున్నారు.
- విజయనగరం సమీపంలోని నరవ, రామవరం, కొర్లాం, తామరపాల్లి, కొఠారుబిల్లి తదితర ప్రాంతాల్లో వరి పంట సంరక్షణ ఇబ్బందికరంగా మారింది. రైతులు రోడ్లపై పనలను ఆరబెట్టడం కనిపించింది. మరోవైపు ఆశించిన స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో కళ్లాల్లో ఉంచిన ధాన్యాన్ని రైతులు విక్రయించుకోలేకపోతున్నారు.
తీరానికే పరిమితమైన మత్స్యకారులు
భోగాపురం, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): వర్షాలకు భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని మత్స్యకారులు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పటికీ కెరటాలు ఉధృతంగా తీరాన్ని తాకుతుండడంతో ఇంకా ఎన్నిరోజులు ఉపాధి పోతుందోనని నిరాశ పడుతున్నారు. పడవలు, వలలు, వేట సామగ్రిని భద్రపరుచుకున్నారు. వలలను బాగు చేసుకోవడం, పడవలు, ఇంజన్లను సరి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.