Rain రోజంతా వాన
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:08 AM
Rain All Day అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా సోమవారం ఎడతెరిపిలేని వాన కురిసింది. కొన్నిచోట్ల మోస్తరుగా.. మరికొన్నిచోట్ల భారీగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారి, కూడళ్లలో నీరు నిలిచింది. పంట పొలాలు కూడా నీట మునిగాయి. జలాశయాలకు వరద పొటెత్తుతోంది.
మరో రెండు రోజులూ వర్షాలు కురిసే అవకాశం
ఆందోళనలో రైతులు
పార్వతీపురం/పాలకొండ/సీతంపేట రూరల్/కొమరాడ/భామిని/ సాలూరు రూరల్/ వీరఘట్టం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా సోమవారం ఎడతెరిపిలేని వాన కురిసింది. కొన్నిచోట్ల మోస్తరుగా.. మరికొన్నిచోట్ల భారీగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారి, కూడళ్లలో నీరు నిలిచింది. పంట పొలాలు కూడా నీట మునిగాయి. జలాశయాలకు వరద పొటెత్తుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోతగా వాన కురవడంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. వినాయక ఉత్సవాలకు సన్నద్ధమవుతున్న వారు కూడా కాస్త ఇబ్బందులకు గురయ్యారు. అధిక వర్షానికి కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలో కొత్తకోట బాలకృష్ణపాత్రుడు, సత్యనారాయణ పాత్రుడికి చెందిన ఇంటిగోడ కూలిపోయింది. మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజన రైతులు మాత్రం పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. భామిని మండలంలో పొలం పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరిపైరు కుళ్లిపోతున్న సమయంలో మళ్లీ వర్షాలు పడుతుండడంతో ఆ ప్రాంతవాసులు దిగులు చెందుతున్నారు. వీరఘట్టం వాసులకు మాత్రం సాగునీటి కష్టాలు తప్పాయి. సాలూరు మండలంలోని పలు గ్రామాల్లోనూ వర్షం కురవడంతో కొన్ని చోట్ల ఉబాలు పూర్తిచేస్తున్నారు. గోముఖి,సువర్ణముఖి తదితర నదులు, వాగుల్లో వరద ఉధృతి పెరిగింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరోవైపు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.