Share News

కొత్తవలస మీదుగా రైల్వే బైపాస్‌ లైన్‌

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:06 AM

కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇప్పటికే కొత్తవలస నుంచి విజయనగరం వరకు 34.7 కిలోమీటర్లు పొడవున నాలుగో లైన్ల కోసం నాలుగు మండలాల్లో సుమారు 218 ఎకరాలను సేకరించింది.

కొత్తవలస మీదుగా రైల్వే బైపాస్‌ లైన్‌

- అనకాపల్లి వరకు 33 కిలోమీటర్లు ఏర్పాటు

- డీపీఆర్‌ సిద్ధం చేసిన రైల్వేశాఖ

- సర్వే కూడా పూర్తి.. భూసేకరణే మిగిలింది

- ఆందోళనలో రైతులు

కొత్తవలస, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇప్పటికే కొత్తవలస నుంచి విజయనగరం వరకు 34.7 కిలోమీటర్లు పొడవున నాలుగో లైన్ల కోసం నాలుగు మండలాల్లో సుమారు 218 ఎకరాలను సేకరించింది. తాజాగా కొత్తవలస నుంచి అనకాపల్లి వరకు కొత్త బైపాస్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను సిద్ధం చేసింది. అవసరమైన భూమి కోసం కొత్తవలస మండలంలోని వివిధ గ్రామాలో సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఇవి కాకుండా విశాఖపట్నం (గోపాలపట్నం) రైల్వే స్టేషన్‌ నుంచి కొత్తవలస వరకు ఇప్పుడు ఉన్న నాలుగు రైల్వేలైన్లకు అదనంగా ఐదు, ఆరు రైల్వే లైన్‌లు ఏర్పాటు కోసం డీపీఆర్‌ను సిద్ధం చేసింది. ఇవన్నీ వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

రద్దీని తగ్గించడానికి..

రాష్ట్రంలోని 11 మార్గాల్లో 1,960 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త రైల్వేలైన్ల ఏర్పాటు కోసం 26 ప్రాజెక్టులకు సంబంధించి రైల్వేశాఖ నివేదికను తయారు చేసింది. ఇందులో భాగంగా ఒడిశా నుంచి కొత్తవలస మీదుగా విశాఖపట్నానికి బొగ్గుతో పాటు వివిధ ఖనిజాలను రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రద్దీ పెరిగిపోవడంతో అదనంగా మరో రెండు లైన్లను ఏర్పాటు చేసేందుకు డీపీఆర్‌ సిద్ధం చేసింది. సింహాచలం నార్త్‌ స్టేషన్‌ నుంచి కొత్తవలస వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్లకు అదనంగా ఐదు, ఆరు లైన్‌లు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం విజయనగరం వైపు నుంచి రాజమండ్రి, కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాలకు సరుకులు రవాణా చేయాలన్నా, అటునుంచి సరుకులు రావాలన్నా విశాఖ, సింహాచలం స్టేషన్‌లు మీదుగా కొత్తవలస మీదుగా వెళ్లాల్సివస్తోంది. కొత్తవలస నుంచి నేరుగా అనకాపల్లి వరకు కొత్త లైన్‌ ఏర్పాటు చేస్తే రైళ్ల రద్దీ తగ్గడమే కాకుండా, నేరుగా విజయనగరం వైపు నుంచి కొత్తవలస, అనకాపల్లికి వెళ్లడానికి మార్గం సులభంగా ఉంటుందని రైల్వేశాఖ ఆలోచన చేసింది. దీని ప్రకారం కొత్తవలస నుంచి అనకాపల్లి వరకు 33 కిలోమీటర్లు రైల్వే బైపాస్‌ లైన్‌ వేసేందుకు డీపీఆర్‌ సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే అధికారులు సర్వేచేశారు. భూసేకరణ చేయడమే మిగిలి ఉంది.

భూములు కోల్పోతున్న రైతులు..

జాతీయ రహదారులు, ఆయిల్‌ కార్పొరేషన్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల కోసం ఇప్పటికే కొత్తవలస మండలంలో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి అధికారులు సేకరించారు. ఇప్పుడు కొత్త రైల్వే లైన్ల కోసం మళ్లీ భూసేకరణ చేపట్టనుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు భూములను ఉంచరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొత్తవలస నుంచి విజయనగరం వరకు 34.7 కిలోమీటర్లు పొడవున నాలుగో రైల్వే లైన్‌కోసం రైల్వేశాఖ సుమారు 218 ఎకరాల భూములను సేకరించారు. తాజాగా ఏర్పాటు చేయనున్న రైల్వే బైపాస్‌ లైన్‌ కోసం కొత్తవలస మండలంతో పాటు అనకాపల్లి జిల్లా కె.కోటపాడు, సబ్బవరం మండలాల్లో వందలాది ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. అదే విధంగా గోపాలపట్నం నుంచి కొత్తవలస వరకు ఐదు, ఆరు లైన్‌లు ఏర్పాటు చేస్తే పెందుర్తి, కొత్తవలస మండలాల్లోని భూములను రైతులు కోల్పోవల్సి ఉంటుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కోసం తమ భూములను కోల్పోయామని, ఇప్పుడు రైల్వేలైన్ల కోసం మిగిలిన భూములను కూడా తీసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రాజెక్టు వచ్చి భూసేకరణ చేస్తారోనని భయంతో, తమ భూములను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:06 AM