Share News

Radical Reforms in the Education System విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:47 AM

Radical Reforms in the Education System ‘విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం.. విద్యాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం భామిని ఏపీ మోడల్‌ స్కూల్‌లో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశాన్ని (పీటీఎం) నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు.

Radical Reforms in the Education System విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

  • విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం

  • పిల్లలు మట్టిలో మాణిక్యాలు.. ప్రోత్సహిస్తే ఏదైనా సాధిస్తారు

  • నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం

  • ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహణ

  • జిల్లా అభివృద్థికి పూర్తి సహకారం

  • విద్యావ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టించింది

  • సీఎం చంద్రబాబునాయుడు

  • భామినిలో మెగా పీటీఎం విజయవంతం

పార్వతీపురం/సీతంపేట రూరల్‌/భామిని, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): ‘విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం.. విద్యాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం భామిని ఏపీ మోడల్‌ స్కూల్‌లో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశాన్ని (పీటీఎం) నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తక్కువ సమయమైనా ఇష్టపడి చదివివే బావుంటుంది. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు పాఠశాలకు హాజరవుతున్నారా? లేదా?అనే విషయాన్ని లీప్‌యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.’ అని తెలిపారు. కొన్ని రోజులుగా పాఠశాలకు రాకపోవడంపై ఓ విద్యార్థినిని సీఎం ప్రశ్నించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల విద్యా ప్రమాణాల స్థాయిని తెలుసుకునేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు.

విద్యార్థుల నాలెడ్జ్‌ అద్భుతం

అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యావిధానం ఎంతో మెరుగ్గా ఉంది. పరీక్షలు జరిగిన తరువాత సమర్ధత తెలుసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు విద్యార్థుల చదువులను పరిశీలించేందుకు తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయి. మధ్యాహ్నం భోజనం నుంచి విద్యాకిట్ల వరకు నాణ్యత పెంచాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ప్రతిభా అవార్డులు అందిస్తున్నాం. క్లస్టర్‌ అప్రోచ్‌ ద్వారా విద్యలో నాణ్యత ప్రమాణాలు పరిశీ లించేందుకు ప్రయత్నాలు చేపట్టాం. ’ అని తెలిపారు.

నెంబర్‌వన్‌గా ఉంచేందుకు కృషి

‘ దేశంలోనే ఏపీ విద్యా వ్యవస్థ నెంబర్‌వన్‌గా ఉంచేందుకు కృషిచేస్తున్నాం. పిల్లలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసేందుకు స్టూడెంట్‌ ఇన్నోవేటర్స్‌ పార్టనర్‌షిప్‌ సమ్మెట్‌ నిర్వహించాలని నిర్ణయించాం. ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తాం. పిల్లల ఆలోచనలు బాగుంటే వారి ప్రతిభను గుర్తించి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం. విదేశీ విద్యకోసం ‘కలలకు రెక్కలు’ పేరిట పథకాన్ని ప్రారంభిస్తాం. పావలా వడ్డీతో విదేశీ విద్యకు రుణాలు అందిస్తాం. జిల్లాలో చేపడుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమలుచేయాలి.’ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని అభినందించారు.

తోటపల్లి, నధుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి

‘జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్ట్‌ ఎడమకాలువపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. నాగవళి, వంశధార నదుల అనుసంధానం చేస్తాం. తాగు, సాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనంతరం విద్యార్థినులకరాటే ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు.

సంస్కరణలు తీసుకొస్తున్నాం: మంత్రి లోకేశ్‌

‘విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకుకొస్తున్నాం. వ్యవస్థను బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి. రాష్ట్రంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే మా లక్ష్యం. చిన్నప్పుడు పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ అంటే ఎంతో భయమేసేది. ఈరోజు పిల్లలు నిర్వహించిన మాక్‌ అసెంబ్లీ సమావేశాలు చూస్తే నాకెంతో ఆనందాన్నిచ్చింది. విద్యా విలువలను పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో పిల్లలకు ప్రవచనాలు, సూక్తులు అందిస్తున్నాం. తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడు చేయకూడదు. విద్యార్థులకు అర్థమయ్యేలా బాలల రాజ్యాంగాన్ని రూపొందించాం. క్లిక్కర్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి పైలెట్‌ ప్రాజెక్ట్‌గా భామిని మోడల్‌ స్కూల్‌లో అమలుచేస్తున్నాం. లీప్‌యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని ద్వారా పిల్లల విద్యా ప్రమాణాల స్థాయిని తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నా వెన్నంటే ఉండి విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు అందిస్తున్నారు. దీనిపై ప్రతి అంశాన్ని చర్చించుకుంటున్నాం. ’ అని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. అంతకముందు ప్రముఖ సాహితీవేత్త కారా మాస్టారు గురించి వివరించారు. ఓ తల్లి కష్టంతో విద్యనభ్యసించిన వ్యక్తి రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యారని టంగుటూరి ప్రకాశం పంతులు గురించి విద్యార్థులకు వివరించారు.

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రసంగాలు..

ఆత్మీయ సమావేశంలో పలువురు విద్యార్థులు తమ ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. సామాజిక భాద్యత, వ్యక్తిగత పరిశుభ్రత, కృతజ్ఞత, బాల్యవివాహాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఫ్రైడే డ్రైడే, ముస్తాబు వంటి అంశాలపై మాట్లాడిన పాఠశాల విద్యార్థినులను సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్‌ అభినందించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, కమిషనర్‌ విజయరామరాజు, ఎస్పీ మాధవరెడ్డి, జేిసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్లు వైశాలి, పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఈవో రాజ్‌కుమార్‌, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ్ణ, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ రామారావు, ప్రిన్సిపాల్‌ బాబురావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి తదితరులు పాల్గొన్నారు.

శభాష్‌ కేదారిసాయి

భామినిలో నిర్వహించిన పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశంలో విద్యార్థులు పలు అంశాలపై ఇచ్చిన సందేశాత్మక ప్రదర్శనలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను ఆకట్టుకున్నాయి. మోడల్‌ పాఠ శాలలో ఆరో తరగతి చదువుతున్న పి.కేదారసాయి అనే విద్యార్థి మానవత విలువలు, కృతజ్ఞత వంటి అంశాలను తెలియజేసే పద్యా లను పాడాడు. వీటిని ఆసక్తిగా విన్న సీఎం బాబు, మంత్రి లోకేష్‌.. విద్యార్థిని దగ్గరకు తీసుకుని అభినందించారు. విద్యార్థితో కలిసి ఫొటోలు దిగారు.

Updated Date - Dec 06 , 2025 | 12:47 AM