Share News

Veterinary Medicine ప్రశ్నార్థకంగా పశువైద్యం

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:54 PM

Questioning Veterinary Medicine గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు సంచార పశువైద్యం అందుబాటులోకి వచ్చింది. టోల్‌ ఫ్రీ నెంబరు 1962కు ఫోన్‌ చేస్తే వాహనాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుకుని వైద్య సేవలు అందించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం.

  Veterinary Medicine  ప్రశ్నార్థకంగా పశువైద్యం
సంచార పశు వైద్య వాహనం

పాడి రైతులకు తప్పని అవస్థలు

కొమరాడ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు సంచార పశువైద్యం అందుబాటులోకి వచ్చింది. టోల్‌ ఫ్రీ నెంబరు 1962కు ఫోన్‌ చేస్తే వాహనాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుకుని వైద్య సేవలు అందించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. పార్వతీపురం మన్యం జిల్లాకు రెండు విడతల్లో ఎనిమిది సంచార పశు వైద్య సేవల అంబులెన్సులను కేటాయించారు. వీటిని పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండేసి వాహనాలను ఇచ్చారు. ఒక్కొక్క వాహనంలో డ్రైవర్‌, నలుగురు (పశు వైద్యులు, టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌) ఉంటారు. వీటి నిర్వహణను జీవీకే ఫౌండేషన్‌కు అప్పగించారు. మొదటి విడతలో నాలుగు వాహనాలు జిల్లాకు రాగా, రెండో విడతలో మరో నాలుగు వాహనాలు వచ్చాయి. 2022లో తొలి విడతగా ప్రతీ నియోజకవర్గానికి వచ్చిన ఒక్కొక్క వాహన ఒప్పంద గడువు గత నెల 15తో ముగిసిపోవడంతో జిల్లాలో నాలుగు వాహనాలు నిలిచిపోయాయి. మిగిలిన నాలుగు వాహనాల ఒప్పంద గడువు కూడా సమీపించడంతో అవి కూడా నిలిచిపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆవులు, గొర్రెలు, గేదెలు, మేకలు జబ్బుల బారిన పడితే అత్యవసర సేవలు ఎలా అందుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా జిల్లాలో ఆవులు 2,28,658, గేదెలు 4,06,017, మేకలు 2,07,451, గొర్రెలు 1,73,110 ఉన్నట్లు అధికారక లెక్కలు చెబుతున్నాయి.

సేవలకు ఆటంకం లేకుండా చర్యలు

పశువులకు వైద్య సేవలు ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. మొదటి విడతలో వచ్చిన అంబులెన్స్‌లు ఆగిపోయిన అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. మిగిలిన అంబులెన్సులతో అత్యవసరమైన వైద్య సేవలు గ్రామాల్లో అందేలా పర్యవేక్షిస్తాం.

-డాక్టర్‌ ఎస్‌.మన్మథరావు, డీఏహెచ్‌వో, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - Mar 16 , 2025 | 10:54 PM