Share News

‘ పుర’ రాజకీయం రసవత్తరం

ABN , Publish Date - Oct 08 , 2025 | 10:57 PM

‘Pura’ Politics Heats Up పార్వతీపురం పురపాలక సంఘంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మునిసిపాలిటీలోనే తొలిసారిగా తాత్కాలిక చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అభివృద్ధికి ఆటంకం కారాదని మెజార్టీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 ‘ పుర’ రాజకీయం రసవత్తరం
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం

  • అభివృద్ధికి ఆటంకం కారాదని మెజార్టీ సభ్యుల నిర్ణయం

పార్వతీపురం,అక్టోబరు8(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పురపాలక సంఘంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మునిసిపాలిటీలోనే తొలిసారిగా తాత్కాలిక చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అభివృద్ధికి ఆటంకం కారాదని మెజార్టీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా గత మునిసిపల్‌ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 30 మంది కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. ఐదు స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, 18 వార్డుల్లో వైసీపీ గెలిచింది. మరో రెండు వార్డుల్లో గెలుపొందిన ఇండిపెండెంట్లతో కలుపుకుని 20 కౌన్సిలర్లతో వైసీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. వైసీపీ నేతలు తమ పాలకవర్గంతో గత ఐదేళ్లూ ఒక చక్రం తిప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్వతీపురం మునిసి పాలిటీలో వైసీపీకి సీన్‌ రివర్స్‌ అయ్యింది. పార్వతీపురం పురపాలక సంఘంలో 20 మంది కౌన్సిలర్లు కూటమికి మద్దుతుగా ఉన్నారు. ప్రస్తుతం పాలకవర్గంలో పది మంది మాత్రమే వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో మెజార్టీ సభ్యుల ఆమోదంతో తాత్కాలిక చైర్‌పర్సన్‌ను ఎన్నుకున్నారు.

ఇదీ పరిస్థితి..

పార్వతీపురం పురపాలక సంఘంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. వైసీపీకి చెందిన చైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ చైర్మన్లు, ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమావేశాలను బహిష్కరిస్తున్నారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా వాకౌట్‌ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అజెండాలను ఆమోదిం చడం లేదు. పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించడం లేదు. గత కొన్ని నెలలుగా మునిసి పల్‌ పాలకవర్గ సమావేశాల్లో ఇదే పరిస్థితి. దీనివల్ల అధికారులు కీలక నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. ఈనెల 7న కూడా ఎప్పటిలానే చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌చైర్మన్‌ వైసీపీ కౌన్సిలర్లు వాకౌట్‌ చేశారు. ఎమ్మెల్యే విజయచంద్ర సూచనతో ఈ మేరకు 1965 మునిసిపల్‌ చట్టం ప్రకారం మెజార్టీ కౌన్సిలర్ల ఆమోదంతో తాత్కాలిక చైర్‌ పర్సన్‌గా మంత్రి ఉమామహేశ్వరిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆధ్వర్యంలో రూ.80 లక్షల విలువైన రోడ్లు, కాలువల పనులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

Updated Date - Oct 08 , 2025 | 10:57 PM