Public Welfare ప్రజా సంక్షేమమే కూటమి ధ్యేయం
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:00 AM
Public Welfare is the Alliance's Goal రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. స్పౌజ్ కేటగిరీ మంజూరైన నూతన పింఛన్లను శుక్రవారం కురుపాంలో లబ్ధిదారులకు అందించారు.
కురుపాం/గరుగుబిల్లి/గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. స్పౌజ్ కేటగిరీ మంజూరైన నూతన పింఛన్లను శుక్రవారం కురుపాంలో లబ్ధిదారులకు అందించారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తేదీనే లబ్ధిదారులకు పెంచిన పింఛన్ అందిస్తుందన్నారు. అనంతం గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలోనూ వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 1,634 మందికి స్పౌజ్ కోటా కింద పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు ఆటంకాలు నెలకొనేవన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు ప్రజలకు అసౌకర్యం కలగకుండా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఏడాది సమయంలోనే రహదారులు అభివృద్ధి, సాగునీటి వనరుల కల్పన, రైతులు, నిరుద్యోగ యువతకు అవసరమైన పథకాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. నేడు అన్నదాత సుఖీభవ కింద నగదు జమవగా, 15న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారని వెల్లడించారు. ఆ తర్వాత ఆమె గుమ్మలక్ష్మీపురంలో కూడా పింఛన్లు పంపిణీ చేశారు.
91 శాతం పింఛన్ల పంపిణీ
పార్వతీపురం/గరుగుబిల్లి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో శుక్రవారం తొలిరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 91.16 శాతం మేర జరిగింది. 15 మండలాలు, మూడు పట్టణాల పరిధిలో 1,40,676 మందికి గాను ప్రభుత్వం రూ. 60.10 కోట్లు మంజూరు చేసింది. కాగా సచివాలయ సిబ్బంది ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము అందించారు. కొత్తగా మంజూరైన స్పౌజ్ పింఛన్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి శ్రేణులు భాగస్వాములయ్యారు.