ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:14 AM
: ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేసి మెరుగైన సేవలందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్.భాస్కరరావు అన్నారు.
డీఎంహెచ్‌వో భాస్కరరావు
పార్వతీపురం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేసి మెరుగైన సేవలందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. స్థానిక ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆశా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, వైద్యసేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. మాతా శిశు నమోదు శాతం పెంచాలని, త్వరితంగా గర్భిణుల నమోదు, పరీక్షలు జరిపి హైరిస్క్ గర్భిణులను గుర్తించాలని ఆదేశించారు. ఆశ కార్యకర్తల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు చేయాలన్నారు. శిశువుల్లో శ్వాస సంబంధిత సమస్యలు గుర్తించే శాన్స్ సర్వే జరిగేటట్టు చూడాలన్నారు. లెప్రసీ సర్వేలో గుర్తించిన లక్షణాలున్న వారికి తగు చికిత్స అందించాలన్నారు. ఈ నెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై మండల, గ్రామ స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఐవో డాక్టర్ విజయమోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, ఎన్‌సీడీ పీవో టి.జగన్మోహన్‌రావు, డీపీవో లీలారాణి, డీసీఎం విజయలత, హెల్త్ ఎడ్యుకేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.