విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:19 PM
గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆదేశించారు.
-జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి
కురుపాం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, మినరల్ వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, వసతి గృహం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని హెచ్‌ఎం, వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం దుడ్డిఖల్లు, దొరజమ్ము, రేగిడి, టిక్కబాయి, పి.అమిటి గిరిజన సంక్షేమ వసతి గృహాలను జేసీ పరిశీలించారు.
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం..
గరుగుబిల్లి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని కుడి ప్రధాన మట్టికట్ట ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ పి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం సుంకి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పార్వతీపురం ఐటీడీఏ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పార్కుకు ఆనుకుని ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని ఐటీడీఏ జేఈ తిరుపతిరావు, వాటర్ షెడ్ ఏపీవో రెడ్డి సురేష్‌కుమార్‌ను ఆదేశించారు. సెలవు దినాల్లో పర్యాటకులు, చిన్నారులు పార్కును వీక్షించేందుకు అనువుగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆట పరికరాలు, సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. సుందరీకరణ పనులు నిర్వహించాలన్నారు. నదిలో బోటు షికారుపై దృష్టి సారించాలన్నారు. కార్తీకమాసం సమయానికి పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు.