Protection for Lakes చెరువులకు రక్షణ
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:30 PM
Protection for Lakes జిల్లాలో చెరువుల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సరిహద్దులు నిర్ణయించి.. వాటి చుట్టూ టేకు మొక్కల పెంచేందుకు ప్రణాళికలు రూపొంది స్తున్నారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
టేకు మొక్కల పెంపకానికి ప్రణాళికలు
పార్వతీపురం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరువుల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సరిహద్దులు నిర్ణయించి.. వాటి చుట్టూ టేకు మొక్కల పెంచేందుకు ప్రణాళికలు రూపొంది స్తున్నారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో చెరువుల లెక్కను సైతం తేల్చారు. మొత్తంగా 450 పంచాయతీల్లో 1843 చెరువులకు బౌండరీలు నిర్ణయించి వాటి చుట్టూ టేకు మొక్కలు పెంచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అంచనాలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే 409 చెరువులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు. మిగిలిన చెరువులకు సంబంధించి అంచనాలు పూర్తయిన తర్వాత టేకు మొక్కలు నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇదీ పరిస్థితి ..
గత కొన్నేళ్లుగా జిల్లాలో చెరువులు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కి రూపు కోల్పోతున్నాయి. అక్రమ నిర్మాణాలు పెరిగిపోతుండడంతో రోజురోజుకూ వాటి విస్తీర్ణం తగ్గిపోతోంది. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. పార్వతీపురం మండలం బాలగొడబ పంచాయతీలో అతిపెద్ద లంకెల చెరువు ఆక్రమణలకు గురై ప్రస్తుతం ఆనవాళ్లను కోల్పోయింది. జిల్లాలో అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అయితే చెరువుల రక్షణపై కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. వాటి చుట్టూ బౌండరీలు నిర్ణయించి, టేకు మొక్కలు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో చెరువులు ఆక్రమణకు గురికాకుండా వాటి చుట్టూ టేకు మొక్కల పెంపకానికి అంచనాలు రూపొంది స్తున్నాం. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.’ అని డ్వామా పీడీ రామచంద్రరావు తెలిపారు.