Share News

Protected water is doubtful.రక్షిత నీరు సందేహమే

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:39 AM

Protected water is doubtful. జిల్లాలో వాటర్‌ ప్లాంట్ల నిర్వహణపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయం అధికారుల తనిఖీల్లో సైతం నిర్ధారణ అవుతోంది. వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (పుడ్‌సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అధారిటీ ఆప్‌ ఇండియా) అనుమతులు తప్పనిసరి.

Protected water is doubtful.రక్షిత నీరు సందేహమే
ఎస్‌.కోట పట్టణంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులు లేవని వాటర్‌ ప్లాంట్‌ను మూసేస్తున్న జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి నాగూల్‌మీరా (ఫైల్‌)

రక్షిత నీరు సందేహమే

ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై అనేక ఆరోపణలు

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులిచ్చేముందు జరగని నీటి పరీక్షలు

ప్రమాణాలకు పాతరేస్తున్న యాజమాన్యాలు

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం

శృంగవరపుకోట, నవంబరు1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వాటర్‌ ప్లాంట్ల నిర్వహణపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయం అధికారుల తనిఖీల్లో సైతం నిర్ధారణ అవుతోంది. వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (పుడ్‌సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అధారిటీ ఆప్‌ ఇండియా) అనుమతులు తప్పనిసరి. అయితే వీటిని పొందడానికి ముందు ప్లాంట్‌ను తనిఖీ చేయడం లేదు. అనుమతి ఉన్న వాటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం లేదు. దీంతో ప్రైవేటు ప్లాంట్‌ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పంపిణీ చేస్తున్న నీళ్లలో నూరుశాతం నాణ్యతను పాటించడం లేదు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఆహార భధ్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ) ధ్రువపత్రం పొందినవారంతా తిని, తాగే వాటిల్లో ప్రజారోగ్యానికి నష్టం కలిగించే అవశేషాలు లేకుండా విక్రయాలు జరపాలి. అయితే తనిఖీలకు వచ్చిన అధికారులు అనుమతి పత్రాలను మాత్రమే అడుగుతున్నారు. నాణ్యత, కొలమాణం వంటి వాటిని పట్టించుకోడం లేదు. ఇదే ఆర్వో ప్లాంటు యజమానులకు కలిసొస్తోంది. పరిశుభ్రమైన నీటిని ఇవ్వాల్సిన వీరు మొక్కుబడి ప్రమాణాలు పాటిస్తున్నారు. ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారు. ఇలాంటి వాటర్‌ ప్లాంట్లలో ఈకోలీ బ్యాక్టీరియా వ్యాప్తిచెందడంతో చాలా మంది డయేరియా బారిన పడుతున్నారు.

పురపాలక, నగరపాలక సంస్థలు, పంచాయతీలు ఉచితంగా సరఫరా చేస్తున్న కుళాయిల నీటి కంటే ఆర్వో ప్లాంట్ల నుంచి సరఫరా జరిగే తాగునీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు అసక్తి చూపుతున్నారు. దీన్నే సురక్షిత నీటిగా భావిస్తున్నారు. వారి నమ్మకాన్ని అవకాశంగా తీసుకుంటున్న పలువురు తాగునీటి ప్లాంట్ల యాజమాన్యాలు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా అమ్మకాలు జరుపుతున్నారు. నేరుగా బోర్లు నుంచి తోడిన వాటర్‌ను పట్టి ఇచ్చేస్తున్నారు. కొన్ని పాంట్ల వద్ద అక్కడే మురుగు నీరు ఉంటోంది. కనీస శుభ్రత ఉండదు. మరికొన్ని ప్లాంట్లు మురుగు నీటి కాలువలు, చెరువులు, బందలను ఆనుకుని ఉన్నాయి. ఇంకొన్ని ప్లాంట్లు అతినీలలోహిత (యూవీ) విధానం సరిగా పనిచేయకుండానే నడిపేస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.

అనుమతులు ఇలా..

జిల్లా పరిధిలో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా వీధికొక్కటి వాటర్‌ ప్లాంట్‌ ఉంది. వివిధ రకాల అనుమతులతో నడిచేవీ కొన్నయితే, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తాగునీటి వ్యాపారం చేసే ప్లాంట్లకు కొదవ లేదు. వీటి ఏర్పాటుకు ముందు స్థానిక సంస్థలు, లీగల్‌ మెట్రాలజీ, ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతులు పొందాలి. ప్లాంట్లకు చెందిన బోరు, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని స్థానిక సంస్థలు అనుమతులు ఇవ్వాలి. నిబంధనలను అనుసరించి తగిన పరిమాణంలో నీటిని అందించేందుకు పరికరాలు ఉండేలా లీగల్‌ మెట్రాలజీ చూడాలి. తాగేందుకు సురక్షతంగా నీరు వుండేలా ఆహార భద్రతా ప్రమాణాల శాఖ పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్న ప్లాంట్లకే అనుమతులు ఇవ్వాలి. తరచూ తనిఖీలు చేపట్టాలి. ఇవేమీ చూడకుండానే ఈశాఖల నుంచి అనుమతులు వచ్చేస్తున్నాయి.

నిఘా లోపం

అనుమతులు ఇచ్చిన తరువాత సంవత్సరాల పొడవునా వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండడం లేదు. ఫుడ్‌ సేఫ్టే అధికారి తనిఖీకి వస్తే స్థానిక సంస్థల అధికారులు, లీగల్‌ మెట్రాలజీ అధికారులు కనిపించరు. వీరొస్తే ఫుడ్‌ సేఫ్టీ అధికారి రారు. తనిఖీలకు వచ్చే అధికారులు వివిధ ధ్రువపత్రాలను అడుగుతున్నారు. లేవంటే వీటిని పొందాలని చెబుతున్నారు. అంతవరకు ప్లాంట్లను తెరవద్దని ఆదేశిస్తున్నారు. అంతే తప్ప నిబంధనలు పాటిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారా? అన్న విషయాల్ని పరిశీలించడం లేదు.

శాంపిల్‌ పంపడం ప్రయాసే

మన రాష్ట్రంలో ఆహార నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌లు లేవు. ఇక్కడ తీసే శాంపిల్స్‌ను తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్‌కు పంపాలి. ఇది ఖర్చుతో పాటు వ్యయ ప్రయాసలకు అధికారులను గురిచేస్తుండడంతో వీలైనంత వరకు శాంపిల్‌లను తీయడం మానేస్తున్నారు. నిర్దేశిత ఫీజుతో పాటు వారి వద్ద వున్న ఇతర అనుమతులను బట్టి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధ్రువపత్రం ఇచ్చేందుకు చూస్తున్నారు.

ప్రమాణాలు ఇలా..

ఆర్వో ప్లాంట్‌ నుంచి సరఫరా చేసే నీళ్లలో 500-22000 మధ్య టీడీఎస్‌ (లవణాలు), 6.5-8.5 మధ్య పీహెచ్‌ (ఆమ్ల, క్షార గుణం), 1-1.5 లీటర్‌ నీటిలో మిల్లిగ్రాం ఫ్లోరైడ్‌, 0-45 నైట్రేట్‌, 0.3-1.0 ఐరెన్‌, 75-200 కాల్షియం, 30-100 మెగ్నీషియం, 200-400 సల్ఫేట్‌, 250-1000 క్లోరైడ్‌లు ఉండా లని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే మించితే రక్తపోటు, కిడ్ని సమస్య, జీర్ణకోశవ్యాధులు, ప్లోరోసిస్‌, పిల్లల్లో బ్లూబేబీ సిండ్రోమ్‌, కడుపులో మంటలు తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:39 AM