Share News

భద్రగిరి ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు ప్రతిపాదనలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:12 AM

మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భద్రగిరి 50 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చెయ్యాలని ప్రతిపాదనలు పంపడం సంతోషకరమని ప్రభుత్వ విప్‌, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.

భద్రగిరి ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు ప్రతిపాదనలు

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 29 (ఆంరఽధజ్యోతి): మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భద్రగిరి 50 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చెయ్యాలని ప్రతిపాదనలు పంపడం సంతోషకరమని, ఇలా అయితే గిరిజన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ విప్‌, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న ఈ భవనాన్ని ఆమెతో పాటు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్‌) నాగశివజ్యోతి మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా నాగశివజ్యోతి మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న 50 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న అవకాశాలను పరిశీలించడానికి వచ్చామన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు మెరుగైన వైద్య సేవలు కోసం దూర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని, ఈ తరుణంలో ఈ ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో వంద పడకల ఆసుపత్రి పూర్తయితే ఏజెన్సీ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు రమ్య, రాజన్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కోలా రంజిత్‌కుమార్‌, టీడీపీ కురుపాం మండల కన్వీనర్‌ కొండయ్య, నాయకులు పాల్గొన్నారు.

నూతనంగా నియమితులైన డీసీహెచ్‌ఎస్‌ నాగశివజ్యోతి తొలుత స్థానిక టీడీపీ క్యాంప్‌ కార్యాల యంలో ఎమ్మెల్యే జగదీశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే ఆమెకు సూచించారు.

మెరుగైన సేవలు అందించాలి

కురుపాం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్‌ నాగశివజ్యోతి ఆదేశించారు. మంగళవారం ఆమె కురుపాం సీహెచ్‌సీని సందర్శించారు. ఆసుపత్రిలో గల వార్డులు, రికార్డులు, ల్యాబ్‌, ఐసీటీసీ, బ్లెడ్‌ బ్యాంకు, మొదలైనవి పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రి భవనం పరిశీలించారు. ఈసందర్భంగా వైద్యధికారులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి అందుతున్న సేవలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:12 AM