Share News

పసుపు పంటకు ప్రోత్సాహం

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:09 AM

మన్యంలో గిరిజన రైతుల పసుపు సాగును ప్రోత్సహిస్తూ.. వారికి ఆర్థిక చేయూతనిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

     పసుపు పంటకు ప్రోత్సాహం
మోహనకాలనీ గిరిజన గ్రామంలో రైతులు ఎండబెట్టిన కస్తూరీ రకం పసుపు కొమ్ములు

-రూ.7.93కోట్లతో పైలెట్‌ ప్రాజెక్ట్‌కు ఆమోదం

- వెయ్యి ఎకరాల్లో అదనంగా సాగు

-90 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరా

-గిరిజన రైతులకు లబ్ధి

-త్వరలో టెండర్ల నిర్వహణ

సీతంపేట రూరల్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మన్యంలో గిరిజన రైతుల పసుపు సాగును ప్రోత్సహిస్తూ.. వారికి ఆర్థిక చేయూతనిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం రూ.7.93కోట్లతో పైలెట్‌ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ నిధులతో సబ్‌ప్లాన్‌ మండ లాల్లోని 1000 ఎకరాల్లో అదనంగా పసుపు సాగు చేపట్టనున్నారు. ఈ ఫైలెట్‌ ప్రాజెక్ట్‌ అమలుతో సుమారు 2వేల మంది గిరిజన రైతులు లబ్ధిపొందనున్నారు. 90శాతం సబ్సిడీతో అందించనున్న పసుపు విత్తనాల సరఫరా కోసం ఇప్పటికే ఐటీడీఏ వేదికగా ఈ-టెండరింగ్‌ ద్వారా బిడ్‌లు ఆహ్వానించారు. అయితే బిడ్‌లు దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వచ్చే ఏడాది జనవరిలో మరోసారి టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఐటీడీఏ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

పంట అభివృద్థికి చర్యలు

ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్‌ మండలాలు ఉన్నాయి. అయితే 12మండలాల్లో నివసిస్తున్న గిరిజన రైతులు అత్యధికంగా పసుపును పండిస్తున్నారు. 3,786 మంది 6,887 ఎకరాల్లో సాగు చేపడుతున్నారు. కాగా గతంలో ఐటీడీఏ ద్వారా ఇచ్చిన కస్తూరీ రకం పంటను మాత్రమే వారు పండిస్తుండడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఎకరాకు 1480 కేజీలు మాత్రమే దిగుబడి వస్తోంది. అయితే పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద అందించనున్న సేలం, ప్రగతి రకాల విత్తనాలతో ఎకరాకు 3టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ రకాలకు చెందిన పసుపు విత్తనాలనే గిరిజన రైతులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అధిక డిమాండ్‌

కొండపోడు వ్యవసాయంలో భాగంగా గిరిజనులు పండించే సాధారణ పంటలతో పాటు ఈ ప్రాంత పసుపునకు మైదాన ప్రాంతంలో గిరాకీ ఎక్కువ. పచ్చి, ఎండు పసుపునకు మంచి ధర లభిస్తుండడంతో వాటి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా సహకారం అందడంతో పసుపుపంటను వేల ఎకరాల్లో సాగుచేసేందుకు గిరిజన రైతులు సిద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహకాలు అందించలేదు. దీంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సబ్సిడీ రూపంలో పసుపు విత్తనాలను అందిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

90శాతం రాయితీ

సబ్‌ప్లాన్‌ మండలాల్లో పసుపు సాగును ప్రోత్సహించేందుకు గాను కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది. ఈ మేరకు 2026-27 ఏడాదికి గాను ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్‌ (స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెంట్స్‌ ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ స్కీం)నిధులు రూ.7.93కోట్లను కేటాయించింది. మరోవైపు ఒక్కో రైతుకు పసుపు విత్తనాలతో పాటు పాలిషర్లు, బ్యాటరీ స్ర్పెయర్ల్‌, ఆర్గానిక్‌ ఎరువులను 90శాతం రాయితీ కింద అందించనుంది. కేవలం 10శాతం వాటాను మాత్రమే గిరిజన రైతు భరించాల్సి ఉంటుంది. ఇకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా దిగుబడి వచ్చే సేలం, ప్రగతి వంటి రకాలకు చెందిన పసుపు విత్తనాలను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ విత్తనాల వినియోగంతో పంట దిగుబడి అధికంగా రానుంది. దీంతో గిరిజన రైతులు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సబ్సిడీతో అందిస్తాం

‘గిరిజన ప్రాంతాల్లో పసుపు సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్సిడీతో కూడిన కొత్తరకం పసుపు విత్తనాలు, తదితర యంత్రాలను అందిస్తాం. అయితే ఈ ఏడాది పసుపు పైలెట్‌ ప్రాజెక్ట్‌ కోసం ఆన్‌లైన్‌ టెండర్‌లు నిర్వహించినప్పటికీ టెండర్‌దారులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వచ్చే ఏడాది టెండర్లు నిర్వహిస్తాం. ’ అని ప్రాజెక్ట్‌ హార్టికల్చర్‌ అధికారి ఆర్‌వీ గణేష్‌ తెలిపారు.

Updated Date - Aug 22 , 2025 | 12:09 AM