Share News

problems to bridge ఎన్నాళ్లీ పాట్లు

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:07 AM

problems to bridgeరెండు రాష్ట్రాలను కలుపుతూ.. రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న పారాది కొత్త వంతెన నిర్మాణం ఎన్నాళ్లయినా కొలిక్కి రావడం లేదు. నిర్మాణ పనులు ఎప్పుడూ నత్త నడకే. వైసీపీ ప్రభుత్వ హయాం నాటి ఇబ్బందులే కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని ప్రయాణికులు, వాహనదారులు విమర్శిస్తున్నారు.

problems to bridge ఎన్నాళ్లీ పాట్లు
పారాది వంతెన దగ్గర పాడైన అప్రోచ్‌ రోడ్డు

ఎన్నాళ్లీ పాట్లు

సంవత్సరాలుగా సాగుతున్న పారాది వంతెన నిర్మాణం

వైసీపీ హయాం నాటి ఇబ్బందులు కొనసాగాల్సిందేనా?

బిల్లులు అందక కాంట్రాక్టర్‌ అవస్థలు

ప్రజలకు, వాహనదారులకు ప్రయాణ కష్టాలు

బొబ్బిలి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాలను కలుపుతూ.. రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న పారాది కొత్త వంతెన నిర్మాణం ఎన్నాళ్లయినా కొలిక్కి రావడం లేదు. నిర్మాణ పనులు ఎప్పుడూ నత్త నడకే. వైసీపీ ప్రభుత్వ హయాం నాటి ఇబ్బందులే కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని ప్రయాణికులు, వాహనదారులు విమర్శిస్తున్నారు. బకాయి బిల్లులు చెల్లిస్తే ఆరు నెలల్లో వంతెన పూర్తి చేస్తామని కాంట్రాక్టర్‌ అంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే బిల్లు పెట్టామంటున్నారు. కాగా అటుగా వెళ్లేవారికి కాజ్‌వే ఒక్కటే మార్గం. అది కూడా తరచూ కొట్టుకుపోతుండడంతో చాలా అవస్థలు పడుతున్నారు. మొంథా తుఫాన్‌ వర్షాలకు వేగావతి పొంగి కాజ్‌వే ధ్వంసమైంది. నడవడానికి కూడా అనుకూలంగా లేదు.

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ 1935లో బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన బ్రిడ్జి పూర్తి శిథిలావస్ధకు చేరుకుంది. దీని స్థానంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.10.90 కోట్లతో కొత్తబ్రిడ్జికి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేశారు. అంతలో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి శంకుస్థాపన చేశారు. పనిమాత్రం చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు దాటుతున్నప్పటికీ పనులు జోరందుకోలేదు. బొబ్బిలి నుంచి పార్వతీపురం మన్యం జిల్లా మీదుగా చత్తీస్‌గడ్‌, ఒడిశా ప్రాంతాలను కలుపుతూ ఉండే ఈ రహదారిలో రెండు వంతెనలూ(సీతానగరం వద్ద ఇంకొకటి) అలాగే ఉన్నాయి.

గత ప్రభుత్వ హయాంలో బిల్లులు అందవనే భయంతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ధైర్యంగా ముందుకొచ్చిన కాంట్ర్టాకర్‌ పనులు చేస్తున్నాడు కానీ బిల్లులు అందక అవస్థలు పడుతున్నాడు. వేగావతి నదిపై పారాది వద్ద, సువర్ణముఖి నదిపై సీతానగరం వద్ద రెండు వంతెనలను ఒక్క కాంట్రాక్టరే నిర్మిస్తున్నారు. ఈయనకు సుమారు రూ.14 కోట్ల బిల్లులు అందాల్సి ఉంది. బిల్లులు అందని కారణంగా పారాది వంతెన పనులు వేగంగా చేయడం లేదు. ఈ లోగా వరదలు మంచెత్తడంతో పారాది కాజ్‌వే మళ్లీ కొట్టుకుపోయింది. ఈ కారణంగా ట్రాఫిక్‌ను దారిమళ్లించడంతో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత రహదారులు సర్వనాశనం అయిపోతున్నాయి.

కాజ్‌వేకు మళ్లీ మళ్లీ మరమ్మతులు

పారాది కొత్త వంతెన పూర్తయ్యేవరకూ ప్రయాణానికి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వ హయాంలో రూ.92 లక్షలతో నిర్మించిన కాజ్‌వే లెక్కలేనన్ని సార్లు కొట్టుకుపోయింది. ప్రతిసారీ కాంట్రాక్టరు తన జేబులో డబ్బులు వెచ్చిస్తున్నారు. మొంథా తుపాన్‌ ప్రభావంతో వచ్చిన వరదకు కాజ్‌వే నామరూపాల్లేకుండా పోయింది. దీనికి మళ్లీ మరమ్మతులు చేయడానికి సుమారు రూ.12 లక్షలు అవసరం. కాజ్‌వేను గతంలో మొక్కుబడిగా నిర్మించిన కారణంగా తరచూ వరదనీటికి కొట్టుకుపోతోంది. ఆ తర్వాత ట్రాఫిక్‌ అవాంతరాలు, వాహనాల మళ్లింపు, గ్రామీణ రోడ్లు పాడవడం షరా మామూలుగా జరుగుతోంది.

బకాయిలు చెల్లిస్తే ఆరు నెలల్లో పూర్తి చేస్తా

పానకాలరావు, కాంట్రాక్టర్‌

పారాది, సీతానగరం వంతెనలకు సంబంధించి నాకు రూ.14 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఈ లోగా వరదనీటికి కొట్టుకుపోతున్న కాజ్‌వేకు అదనంగా ఖర్చు చేస్తున్నాను. బకాయిలన్నింటినీ చెల్లిస్తే ఆరు నెలల్లో వంతెన పనులను పూర్తి చేయగలను. బిల్లులు అందకపోయినా సుమారు 60 శాతం పనులను పూర్తి చేశాను.

రూ.3.5 కోట్లతో బిల్లులు పెట్టాం

బీఏ రాజు, ఆర్‌అండ్‌బీ ఏఈ, బొబ్బిలి

పారాది వంతెనకు సంబంధించి రూ.3.5 కోట్ల బిల్లులు పెట్టాం. మరో మూడున్నరకోట్ల రూపాయలకు బిల్లులను ప్రతిపాదించనున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వేగావతిలో వరదనీరు రావడంతో కాజ్‌వే పూర్తిగా పాడైంది. దీని పునర్నిర్మాణం కోసం సుమారు రూ.12 లక్షల నిధులు అవసరం.

Updated Date - Nov 07 , 2025 | 12:07 AM