Share News

problems for travel on the road ఆ రోడ్డుపై అగచాట్లేనా?

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:44 PM

problems for travel on the road జిల్లాలో కీలకమైన రహదారి అభివృద్ధి అంశం అయోమయంలో పడింది. ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రం విజయనగరం నుంచి మన్యం జిల్లా పాలకుండ వెళ్లే రహదారి చాలా అధ్వానంగా తయారైంది. ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఒక్కో చోట అడుగుకో గుంత కనిపిస్తోంది.

problems for travel on the road ఆ రోడ్డుపై అగచాట్లేనా?
విజయనగరం-పాలకొండ రోడ్డులో మజ్జిరామునిపేట వద్ద అడుగుకో గుంత

ఆ రోడ్డుపై అగచాట్లేనా?

విజయనగరం- పాలకొండ రోడ్డు అభివృద్ధికి నో చాన్స్‌

పీపీపీ విధానంలో నిర్మాణానికి వీలులేదట

చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డుకు మాత్రమే అంగీకారం

డీపీఆర్‌ తయారీలో స్పష్టం

విజయనగరం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కీలకమైన రహదారి అభివృద్ధి అంశం అయోమయంలో పడింది. ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రం విజయనగరం నుంచి మన్యం జిల్లా పాలకుండ వెళ్లే రహదారి చాలా అధ్వానంగా తయారైంది. ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఒక్కో చోట అడుగుకో గుంత కనిపిస్తోంది. అయితే ఈ రోడ్డుతో పాటు ఉమ్మడి జిల్లాకు అనుసంధానంగా ఉన్న మరో రెండు రహదారులను అభివృద్ధి చేస్తే మూడు జిల్లాలకు(విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం) రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మూడు ప్రధాన రహదారులపై దృష్టిపెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో నిర్మించాలని నిర్ణయించింది. రోడ్లు భవనాల శాఖ ఆ మేరకు ప్రతిపాదనలు కూడా పంపింది. కానీ డీపీఆర్‌ తయారీ తర్వాత రెండు రహదారులకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కళింగపట్నం- శ్రీకాకుళం- పార్వతీపురం (సీఎస్పీ) రహదారి, పాలకొండ-విజయనగరం రహదారి సాధ్యం కాదని డీపీఆర్‌లో తేల్చేశారు. అనూహ్యంగా చిలకపాలెం- రామభద్రపురం-రాయగడ (సీఎస్‌ఆర్‌) సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామంతో రెండు రహదారుల పరిస్థితి అగమ్యగోచరంలో పడింది.

పీపీపీ విధానంలో నిర్మించనున్న ఈ రోడ్లకు సంబంధించి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని తెలిసింది. డీపీఆర్‌ రూపొందించడంలో వాటినే ప్రమాణికంగా తీసుకున్నారు. వాహన రాకపోకల స్థాయి, నిర్వహణ వ్యయం, టోల్‌టాక్స్‌ల వసూళ్లు వంటి అంశాలను అంచనా వేశారు. ఈవిధానంలో పరిశీలిస్తే విజయనగరం-పాలకొండ, పార్వతీపురం-కళింగపట్నం రోడ్లు నిర్మించడం సాధ్యం కాదని తేల్చేశారు. ఇందులో శ్రీకాకుళం-పార్వతీపురం రోడ్డును 108 కిలోమీటర్ల మేర రెండు లేదా నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని భావించారు. ఇందుకుగాను రూ.567 కోట్లు అవసరమని గుర్తించారు. విజయనగరం-పాలకొండ రహదారిని 70 కిలోమీటర్ల మేర నాలుగు లేదా రెండు వరుసల్లో విస్తరించాలని చూశారు. ఇందుకుగాను రూ.642 కోట్లు అవసరమని గుర్తించారు. చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డును 131 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. అయితే ఇది అంతర్‌ రాష్ట్ర రోడ్డు కావడంతో వాహనాల రాకపోకల దృష్ట్యా ఆదాయం ఉంటుందని అంచనా వేశారు. అందుకే ఈ రోడ్డు నిర్మాణానికి రూ.1172కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా.. అదే స్థాయిలో లాభం ఉంటుందని ఆర్థిక సాంకేతిక బృందం తేల్చింది. అందుకే ఈ రోడ్డు మినహాయించి మిగతా రెండు రోడ్లకు మాత్రం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

- జిల్లాలో ప్రధానంగా విజయనగరం-హడ్డుబంగి రహదారి ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలను కలుపుతూ ఉంటుంది. ఇటువంటి రహదారికి డీపీఆర్‌ ఆమోద ముద్ర వేయకపోడం విచారకరం. ముఖ్యంగా విజయనగరం నుంచి పాలకొండ వరకూ 64 కిలోమీటర్ల మేర రహదారిని బాగుచేస్తే రవాణా కష్టాలు తీరుతాయి. పర్యాటక, వాణిజ్య అవసరాలు మరింత మెరుగుపడతాయి. వైసీపీ సర్కారు ఎలాగు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మోక్షం లభించలేదు. ఈ రోడ్డు ధ్వంసం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని దుస్థితి. ముఖ్యంగా రాజాం నుంచి పాలకొండ వరకూ ఉన్న రహదారి దారుణంగా తయారైంది. రాజాం పట్టణంలో అయితే రోడ్లు నరకం చూపిస్తున్నాయి. ఈ రహదారి విషయంలో జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.

ప్రతిపాదనలు పంపాం

విజయనగరం-పాలకొండ రహదారిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపాం. పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి నిధుల ప్రకటన వస్తుందని ఆశతో ఉన్నాం.

- కాంతిమతి ఎస్‌ఈ, రోడ్లు భవనాల శాఖ, విజయనగరం

=======

Updated Date - Aug 24 , 2025 | 11:44 PM