Share News

Priority given to the welfare of auto workers ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:03 AM

Priority given to the welfare of auto workers

 Priority given to the welfare of auto workers ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
ఆటో నడుపుతున్న హోంమంత్రి వంగలపూడి అనిత

ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

తప్పనిసరిగా బీమా చేయించుకోండి

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి

హోంమంత్రి అనిత

విజయనగరం/ క్రైం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలోని మెసానిక్‌ టెంపుల్లో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ భాగంగా శనివారం ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేసే కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. తొలుత జడ్పీ అతిథి గృహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజుతో కలిసి ఆటోలో ప్రయాణించారు. స్వయంగా ఆటో నడిపి డ్రైవర్లను ఉత్తేజపరిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 15,417 మంది డ్రైవర్లకు గాను రూ.23 కోట్ల 21 లక్షలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ఖాకీ షర్ట్‌ ధరిస్తే హుందాగా, గౌరవప్రదంగా, కర్తవ్య నిష్టతో ఉన్నట్లు ఉంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేశామని, దీంతో ఆటో డ్రైవర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా తిరుగుతున్నారన్నారు. ఇదే సమయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని, రోడ్లపై వెళ్లేటప్పుడు ఒకరిద్దరు ప్రయాణికుల కోసం అకస్మాత్తుగా ఆటోలు ఆపుతుంటారని, దీనివల్ల వెనుక వచ్చే వాహనాలు కంట్రోల్‌ తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ఈవిషయాన్ని ఆటో డ్రైవర్లు గుర్తించాలని సూచించారు. ఆటోలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బీమానే కుటుంబాలకు జీవనాధారంగా ఉంటుందన్నారు. విధుల్లో అధికారుల సూచనలు పాటించాలని, ట్రాఫిక్‌ రూల్స్‌ను అనుసరించాలని చెప్పారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, పైడిమాంబ పండుగ సమయంలో ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించిందని, పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆమె కోరారు. తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రూ.15 వేల ఆర్థిక సాయం అందించడం ఎంతో శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, రవాణా ఉపకమిషనర్‌ మణికుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ, ఎంవీఐలు మురళీకృష్ణ, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

బీమా, ఫిట్‌నెస్‌ చేయించుకుంటాను

రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు అందిస్తున్న రూ.15 వేల సాయంతో తమ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. ఈ నగదుతో ఆటోకి బీమా, ఫిట్‌నెస్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ చేయించుకుంటే ఏడాది పాటు ఎటువంటి ఒత్తిడి లేకుండా రోడ్డుపై ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాను. ఈ పథకంతో ఆటో కార్మికులకు ఎంతో మేలు.

- గోవిందరావు, ఆటోడ్రైవర్‌, తాడివాడ, డెంకాడ మండలం

సీఎంకు ధన్యవాదాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి అందిస్తున్న రూ.15 వేల ఆర్థికసాయం మరువలేనిది. ఈ సాయంతో తాము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆటోకార్మికుల జీవనోపాధికి ఈ సాయం ఎంతో దాహోదపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు.

- శ్రీనివాసరావు, ఆటోడ్రైవర్‌, విజయనగరం

ఆటో బాగుచేసుకుంటాను

కొన్నేళ్లుగా ఆటో తోలుతూ ఉపాధి పొందుతున్నాను. రోజుకు డీజిల్‌ఖర్చులు పోనూ రూ.600 నుంచి రూ.800 గిట్టుబాటు అయ్యేది. మహిళలు ఫ్రీబస్‌లో వెళ్తుండడంతో రోజుకు రూ.500కు మించి రావడం లేదు. కుటుంబ జీవనం కష్టంగా మారింది. ఆటోకు చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయించలేకపోతున్నాను. ఈ సమయంలో రూ.15 వేలు ఇవ్వడం కొండంత అండగా భావిస్తున్నాను. ఈ డబ్బులతో ఆటో బాగుచేసుకుంటాను. టైర్లు కొత్తవి కొనుక్కుంటాను.

- కాళ్ల శంకరావు, ఆటోడ్రైవర్‌, గంగచోళ్లపెంట, గజపతినగరం మండలం

Updated Date - Oct 05 , 2025 | 12:03 AM