గ్రామాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:15 AM
: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్ తెలిపారు.
- రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
- విశాఖ ఎంపీ శ్రీభరత్
శృంగవరపుకోట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్ తెలిపారు. శుక్రవారం శృంగవరపుకోట నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు నిర్మాణాలను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ విద్యార్థులు కష్టపడి చదువుతారని, వారిని ప్రోత్సహించేందుకు ఎంపీ లాడ్స్ నిధులను కేటాయిస్తానన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీకి ఓట్లు వేయని గ్రామాల అభివృద్ధిపై వివక్ష చూపిందన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందన్నారు. వేపాడ మండలంలో వరి సాగు బాగా కనిపిస్తుందన్నారు. సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు త్వరలో ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కాభవనాల నిర్మాణాలతోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు రూ.6కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు. ఎంపీ లాడ్స్ నిధులను కేటాయించేందుకు ఎంపీ శ్రీభరత్ ముందుకు రావడంతో ధన్యవాదాలు తెలిపారు. ఎస్.కోట శాఖా గ్రంథాలయానికి సొంత భవనం నిర్మించాలని లైబ్రేరియన్ దామోదర శ్రీధర్, ఎస్.కోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఉమ్మడి క్రీడా మైదానం బాగు చేయాలని టీడీపీ యువత అధ్యక్షుడు వాకాడ బాల ఈశ్వర భరత్, టీడీపీ టౌన్ కార్యదర్శి కాపుగంటి శ్రీనివాసరావు వినతిపత్రం అందించారు.
-లక్కవరపుకోట మండలం రంగారయపురంలో రూ.7.50 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం ప్రారంభం, శృంగవరపుకోట మండలం శివరామరాజుపేటలో రూ.90లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ.53 లక్షలతో ఎంఆర్‌సీ భవనం, రూ.3కోట్లతో బాలికల వసతి గృహానికి పక్కా భవనం పనులకు శంకుస్థాపన, తలారి శివారు ఉసిరి గ్రామంలో రూ.40లక్షలతో సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణం, వేపాడ మండలం ముకుందపురంలో రూ.39లక్షలతో నిర్మించిన బిడ్జి ప్రారంభం, కరకవలసలో రూ.32లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవన నిర్మాణానికి ఎంపీ శ్రీభరత్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దాసరి కార్పొరేషన్ చైర్మన్ రత్నాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రాయవరపు చంద్రశేఖర్, ఇందుకూరి సుధారాణి, ఎస్.కోట, వేపాడ ఎంపీపీలు సోమేశ్వరరావు, సత్యవంతుడు, ఎస్.కోట సర్పంచ్ గనివాడ సంతోషి కుమారి, నాయకులు జీ.ఎస్ నాయుడు, డోకుల చిన్న అచ్చంనాయుడు, కోట్యాడ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.