Share News

Prices are up ధరలు పైపైకి

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:55 PM

Prices are up మార్కెట్లో అన్ని సరుకుల ధరలూ కొండెక్కి కూర్చున్నాయి.. ఇక ఏం కొంటాం.. ఏం తింటాం అని పేదలు నిరాశ చెందుతున్నారు. ధరల నియంత్రణకు కృషి చేయాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నల్లబజారుకు తరలిపోతున్న సరుకులు, అక్రమ నిల్వలను వెలికితీయడంలో విజిలెన్స్‌ అధికారుల వైఫల్యం వెరసి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

Prices are up ధరలు పైపైకి

ధరలు పైపైకి

కార్తీక మాసం ఆరంభంతో పెరిగిన నిత్యావసరాల ధరలు

అదే దారిలో కూరగాయలు

ఏం కొనలేమంటున్న పేదలు

రోజురోజుకూ ధరల్లో మార్పులు

రాజాం రూరల్‌/ గజపతినగరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి):

మార్కెట్లో అన్ని సరుకుల ధరలూ కొండెక్కి కూర్చున్నాయి.. ఇక ఏం కొంటాం.. ఏం తింటాం అని పేదలు నిరాశ చెందుతున్నారు. ధరల నియంత్రణకు కృషి చేయాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నల్లబజారుకు తరలిపోతున్న సరుకులు, అక్రమ నిల్వలను వెలికితీయడంలో విజిలెన్స్‌ అధికారుల వైఫల్యం వెరసి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సామాన్యుల గుండెలు గుబేల్‌ మంటున్నాయి. పెరిగిన ధరలు మధ్యతరగతి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. బియ్యం ధరలు కూడా దడ పుట్టిస్తున్నాయి. సాధారణ రకం బియ్యం కొందామన్నా కిలో రూ.50 వరకూ ఉంది. కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఒకటి రెండు మినహా ఏది ముట్టుకున్నా కిలో రూ.60 పైనే పలుకుతోంది. ఓవైపు మాలధారణలు, మరోవైపు కార్తీకమాసం రాకతో కూరగాయల వినియోగం ఎక్కువైంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా మార్కెట్లో లేదు. ఇటీవల కాలంలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు నాశనమయ్యాయి. దీనివల్ల కూడా ధరలకు రెక్కలొచ్చాయి. మధ్యతరగతిపై మరింత భారం పడుతోంది. టమాటా, వంకాయలు, బీరకాయలు, తదితర కూరగాయలు కిలో రూ.60 పలుకుతున్నాయి. బెండకాయలు రూ.50 కాగా, పొడవు చిక్కుళ్లు కిలో రూ. 40, రెండు చిన్న అరటికాయలు రూ.20 కాగా కిలో మునక్కాడల ధర రూ.80 ఉంది. చిన్నపాటి కొత్తిమిర కట్ట రూ.15కి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి, అల్లం, వెళ్లుల్లి ధరలు సైతం ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. వీటన్నింటి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులే చెబుతున్నారు.

పప్పులుడకడం లేదు

కిలో కందిపప్పు ధర రూ. 150 కాగా పెసరపప్పు ధర రూ.90, మినప్పప్పు మొదటిరకం ధర రూ. 145 కాగా చిన్నగుళ్లు రూ.130గా ఉంది. ఇలా ఏ పప్పుల ధరలు అడిగినా షాక్‌ కొట్టే సమాధానమే కొనుగోళు దారులకు వినిపిస్తోంది. నూనెల ధరలూ కాగుతున్నాయి. ఆధార్‌ ఆయిల్‌ లీటర్‌ రూ. 130 కాగా, ఫ్రీడం వంటి ఇతర కంపెనీల ఆయిల్‌ ధరలు లీటర్‌ రూ.140 నుంచి రూ.160 మధ్యలో ఉన్నాయి.

చేదెక్కిన చక్కెర

చెరకు విస్తీర్ణం ఏయేటికాయేడు తగ్గుతూ వస్తోంది. ఫలితంగా చక్కెర ధర అమాంతం పెరిగింది. చక్కెరలో రెండు మూడురకాలు ఉండడంతో చిన్నపూస ధర రూ.45తో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంది. పెద్దపూస కిలో రూ.55గా ఉంది. బెల్లం రూ.50కి చేరింది.

రైతుబజార్‌ లేక మరింత భారం

నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం పట్టణంలో ఇంతవరకు రైతుబజార్‌ లేదు. గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరుతో పాటు మెంటాడ మండలాలకు చెందిన కూరగాయల రైతులు తాము పండించిన పంటలను గజపతినగరం తీసుకువస్తుంటారు. వ్యాపారులు వారికి నచ్చిన ధరకు కొనుగోలు చేస్తుంటారు. అనంతరం విజయనగం, ఆనందపురం తదితర పట్టణప్రాంతాలకు తరలించకుపోతుంటారు. దీనివల్ల గజపతినగరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలపై అధిక మొత్తాన్ని కేటాయించాల్సి వస్తోంది. మార్కెట్‌లో ధరలు చూసి కొందరు పేదలు ఏం కొనలేక తిరిగి ఖాళీ సంచులతో వెళ్లిపోతున్నారు.

ధరలు భారంగా ఉన్నాయ్‌

సూర్యకళ, గృహిణి, వాసవినగర్‌, రాజాం

కార్తీకమాసం రాకతో నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు ధర రేపు ఉండడం లేదు. ఇలా అయితే పేదలు ఎలా బతుకుతారు. ధరలను కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నించడంలేదనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నవాళ్లు ధరల గురించి ఆలోచించరు.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకే సమస్యంతా.

Updated Date - Oct 27 , 2025 | 11:55 PM