ధరలు పేలుతున్నాయ్!
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:08 AM
దీపావళి సమీపిస్తుండడంతో జిల్లాలో బాణసంచా విక్రయాలు ఊపందుకున్నాయి.
- చుక్కలనంటుతున్న బాణసంచా రేట్లు
- జీఎస్టీని సాకుగా చూపుతున్న వ్యాపారులు
- తెల్లకాగితాలే రశీదులు
- తయారీ, విక్రయ కేంద్రాల వద్ద కానరాని నిబంధనలు
విజయనగరం/టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దీపావళి సమీపిస్తుండడంతో జిల్లాలో బాణసంచా విక్రయాలు ఊపందుకున్నాయి. హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, వ్యాపారులు జీఎస్టీని సాకుగా చూపి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో టపాసుల ధరలు పేలుతున్నాయి. సామాన్యులకు అందనంత స్థాయిలో తారాజువ్వాల్లా దూసుకుపోతున్నాయి. రూ.2వేలు తీసుకువెళ్లితే తప్ప సామగ్రి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది లక్ష్మీబాంబుల కట్ట(10) రూ.200 ఉండగా ఈ ఏడాది రూ.600 పలుకుతోంది. బ్రాండెడ్ క్రాకర్లు విక్రయించడం లేదు. తక్కువ నాణ్యతకు చెందిన రకాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క బాక్సు రూ.400 వరకు పలుకుతోంది. వాస్తవానికి బాణసంచా విక్రయాలకు సంబంధించి లైసెన్స్ నంబర్, టిన్ నంబర్‌తో ఉన్న రశీదుపై బిల్లులు ఇవ్వాలి. కానీ, తెల్ల కాగితంపై బిల్లు రాసి కొనుగోలుదారులకు ఇస్తున్నారు. లైసెన్స్ దుకాణాల ద్వారా రూ.50 కోట్ల వరకూ అమ్మకాలు సాగుతాయి. ఈ లెక్కన ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరముంది.
నిబంధనలకు విరుద్ధంగా షాపులు..
జిల్లాలో ముగ్గురికి మాత్రమే బాణసంచా విక్రయాలకు శాశ్వత లైసెన్స్ ఉంది. వీరు తప్ప ఎవరూ అమ్మకాలు సాగించేందుకు వీలులేదు. కానీ, తాత్కాలిక షాపుల పేరిట అధికారులు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే వందలాది షాపులకు అనుమతులు ఇవ్వడంతో వారు ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. వీరు రెండు రోజుల పాటు మందుగుండు విక్రయించుకోవచ్చు. అయితే, జనావాసాల మధ్య, జాతీయ రహదారుల చెంతనే తాత్కాలిక షాపులు ఏర్పాటు చేస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం కేఎల్‌పురంలో షాపులను దూరంగా ఉంచాలని స్థానికులు కోరినా ఫలితం లేకపోయింది. 26వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా ఇబ్బందికరమే.
- బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల వద్ద అసలు నిబంధనలు పాటించడం లేదన్న విమర్శ ఉంది. తయారీ కేంద్రాలు బలంగా ఉండాలి. మంటలు చెలరేగితే ఆర్పేలా సంబంధిత పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. 25 వేల లీటర్ల నీటి సామర్థ్యంతో ఒక సంపు నిర్మించుకోవాలి. డీజిల్, ఇంజన్, కార్బన్‌డయాక్సైడ్ గ్యాస్ సిలిండర్లు, పొడి ఇసుకను బకెట్లలో నింపి ఉంచాలి. 15 కిలోలకు మించి మందుగుండు సామగ్రి, నలుగురుకు మించి కూలీలు ఉండకూడదు. అయితే ఇవెక్కడ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాల వద్ద కనిపించడం లేదు.
12 మంది వ్యాపారులపై కేసులు
బాణసంచా విక్రయాలకు సంబంధించి కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఇటీవల కీలక ఆదేశాలు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులను ఏర్పాటుచేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజయనగరం తహసీల్దార్ కూర్మనాథ్ బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. ఇక్కడ పనిచేసే కార్మికులకు వ్యాపారులు బీమా విధిగా కట్టాలి. కానీ, ఈ నిబంధన పాటించని 12 మంది వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేశారు.
నిబంధనలు పాటించాల్సిందే
జిల్లాలో బాణసంచా విక్రయాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేపడితే వ్యాపారులపై చర్యలు తప్పవు. కచ్చితంగా ధరలకు అనుగుణంగానే విక్రయించాలి. తప్పకుండా రశీదులు ఇవ్వాలి. తయారీ, విక్రయ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలి.
- రామసుందర్‌రెడ్డి, కలెక్టర్