Share News

Prevent the spread of diseases వ్యాధులు ప్రబలకుండా చూడండి

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:08 AM

Prevent the spread of diseases జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా చూడాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా ముందుగానే గ్రామాల వారీగా మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Prevent the spread of diseases వ్యాధులు ప్రబలకుండా చూడండి
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి అనిత

వ్యాధులు ప్రబలకుండా చూడండి

ఒక్క డయేరియా కేసు రాకూడదు

గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించండి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత

తోటపల్లి ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి: మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా చూడాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా ముందుగానే గ్రామాల వారీగా మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష సమావేశం గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత వైద్యం, వ్యవసాయం, జలవనరులు, ఎక్సైజ్‌ తదితర శాఖలపై సమీక్షించారు. వర్షాలు కురుస్తుండడంతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. దీనిపై కలెక్టర్‌ బీర్‌ అంబేడ్కర్‌ స్పందిస్తూ పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తున్నామని, పైప్‌లైన్లను తనిఖీ చేయించి డ్రైనేజీ వద్ద నున్న కొళాయిలను తొలగించి రక్షిత నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ చర్యలతో గత ఏడాది కంటే ఈ ఏడాది డయేరియా, డెంగ్యూ, మలేరియా కేసులు తగ్గాయని వివరించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి మాట్లాడుతూ శానిటేషన్‌ గతం కంటే మెరుగు పడిందన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్‌పై సమీక్షలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తోటపల్లి నీటిని ఆలస్యంగా విడుదల చేసినందుకు శివారు భూములకు సకాలంలో నీరందలేదని, ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. రాజాం మండల రైతులకు నీరందడానికి ఇంకా 15 రోజులు పడుతుందని, గతంలో ఇటువంటి పరిస్థితి లేదని అన్నారు. ఇన్‌చార్జి మంత్రి అనిత స్పందిస్తూ మూడు జిల్లాలకు సంబంధించిన అంశం కాబట్టి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాల ప్రతినిధులతో మాట్లాడుకొని విడుదల చేయాల్సి ఉందని, నీటి విడుదలకు మూడు నెలల ముందే పక్కా ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తోటపల్లి ద్వారా 1,30,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఉన్నామని, లిఫ్ట్‌ ద్వారా ఎంత నీరు వెళుతోంది... కుడి, ఎడమ కాలువల ద్వారా ఎంత నీరు సరఫరా అవుతోంది అనే వివరాలు తెలియజేస్తూ సమగ్రంగా నివేదిక ఇవ్వాలన్నారు. డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి తోటపల్లి ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు.

- వ్యవసాయ శాఖ సమీక్షలో భాగంగా ఎరువుల కొరత పెద్దగా లేదని, ఇంకా 5 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉందని, త్వరలో జిల్లాకు ఎరువుల స్టాక్‌ వస్తుందని కలెక్టర్‌ తెలిపారు. ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలను గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారని, ఆ యూనిట్ల వివరాలు, ఎలా పని చేస్తున్నదీ, విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జేసీకి సూచించారు.

- ఐసీడీఎస్‌ సమీక్షలో భాగంగా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ బాల్య వివాహాలు, మహిళల రక్షణ, పోక్సో చట్టం, శక్తి యాప్‌, బ్యాడ్‌గుడ్‌ టచ్‌ తదితర అంశాలపై మహిళలకు, బాలలకు అవగాహన కలిగించాలన్నారు. పోలీస్‌ శాఖ, విద్యా శాఖ వారితో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.

- పరిశ్రమల శాఖ సమీక్షలో మంత్రి అనిత మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పరిశ్రమల జాబితా, మూత పడిన వాటి జాబితా, మూత పడిన పరిశ్రమల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు వారి జాబితాతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మహిళల ఉచిత ప్రయాణానికి స్ర్తీశక్తి బస్సులు

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి ఉద్దేశించిన స్ర్తీశక్తి కార్యక్రమాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. ముఖ్యమంత్రి విజయవాడ నుండి ఈ బస్సులను ప్రారంభిస్తారని, అనంతరం అన్ని నియోజకవర్గాల్లో బస్సుల ప్రారంభం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటికి 150 బస్సులను సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాది ఆక్టోబరులో జరగనున్న పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్యను ఆదేశించారు.

- గంట్యాడ, రాజాం డ్వాక్రా సంఘాల వారికి రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం పట్ల మంత్రులు అభినందించారు. అలాగే వంగర కేజీబీవీకి ఉత్తమ అవార్డు రావడంపై కూడా అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించిన రెడ్డి భవానిని అభినందిస్తూ కొండకరకాంలో 97.2 చ.గజాల ఇళ్ల స్థలం పట్టాను ఆమె తల్లిదండ్రులకు మంత్రులు అనిత, శ్రీనివాస్‌ అందజేశారు.

జిందాల్‌కు తాటిపూడి నీరు కేటాయించలేదు

జిందాల్‌ పరిశ్రమకు తాటిపూడి నీరు కేటాయించడంపై సమావేశంలో ఎమ్మెల్సీ రఘరాజు అభ్యంతరం చెప్పారు. కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కలుగుచేసుకుని తాటిపూడి నుంచి జిందాల్‌కు నీరు కేటాయించలేదని, ఇస్కో కంపెనీకి 5 ఎంఎల్‌డి నీటిని అందిస్తున్నామన్నారు. దీనిపై చాలారోజుల కిందటే ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇస్కో నుంచి మహావిశాఖ నగరపాలక సంస్థకు మంచినీరుసరఫరా అవుతోందని, ప్రభుత్వానికి డబ్బులు కూడా చెల్లిస్తోందని చెప్పారు. అలాగే ఇస్కో నుంచి జిందాల్‌ కంపెనీ కూడా నీటిని సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని కలెక్టర్‌ అంబేడ్కర్‌ స్పష్టం చేశారు.

సమావేశంలో పార్లమెంట్‌ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు డా.సురేష్‌ బాబు, ఇందుకూరి రఘురాజు, గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కాపు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ యశస్విని, ఎస్పీ వకుల్‌జిందాల్‌, డీఆర్‌వో శ్రీనివాస మూర్తి. సీపీవో బాలాజీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:08 AM