Share News

గణ నాథుడి ఉత్సవాలకు సన్నద్ధం

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:14 AM

Preparing for Lord Gananatha’s Festivities వినాయక నవరాత్రి ఉత్సవాలకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. ఘనంగా పండుగ జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మండపాలు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, విగ్రహాల తయరీలో ఎవరికివారు బిజీగా ఉన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 27 నుంచి ఆరంభం కానుండగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడానికి నిర్వాహకులు బ్యాండ్‌, తీన్‌మార్‌ మేళాలను బుక్‌ చేసుకున్నారు.

గణ నాథుడి ఉత్సవాలకు సన్నద్ధం
సాలూరులో సిద్ధమైన మట్టి గణపతి విగ్రహాలు

సాలూరు రూరల్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి ఉత్సవాలకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. ఘనంగా పండుగ జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మండపాలు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, విగ్రహాల తయరీలో ఎవరికివారు బిజీగా ఉన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 27 నుంచి ఆరంభం కానుండగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడానికి నిర్వాహకులు బ్యాండ్‌, తీన్‌మార్‌ మేళాలను బుక్‌ చేసుకున్నారు. కాగా బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అనుమతి పొందాలని మరోవైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సాలూరులో 11 కుటుంబాలు మట్టి గణపయ్య విగ్రహాలను తయారు చేస్తున్నారు. మక్కువ, పాచిపెంట, రామభద్రపురం, ఒడిశాలో సుంకి, రాళ్లగెడ్డ, కుందిలి, సిమిలిగుడ, లావుడి, పెదపాడు తదితర గ్రామస్థులు సాలూరులో విగ్రహాలను తీసుకెళ్తుంటారు. కాగా గత రెండు నెలలుగా విగ్రహాల తయారీ పనుల్లో తయారీదారుల కుటుంబాలు ఉన్నాయి. రూ. వెయ్యి నుంచి రూ. 25 వేలు పైబడి.. ఆర్డర్‌ను బట్టి మట్టి, గడ్డి, నారసంచులు తదితర వాటితో పర్యావరణహిత విగ్రహాలను తయారు చేస్తున్నారు. మొత్తంగా సాలూరులో 96 శాతం ఉత్సవ నిర్వాహకులు మట్టి విగ్రహాలనే వినియోగిస్తారు. వాటిని వేగావతి నది, కోనేరుల్లో నిమజ్జనం చేస్తారు.

మండపాలకు ఉచిత విద్యుత్‌...

పార్వతీపురం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): వినాయకుని విగ్రహాలు పెట్టే మండపాలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గణేష్‌ ఉత్సవ కమిటీలకు విద్యుత్‌ భారం తగ్గనుంది. పార్వతీ పురం డివిజన్‌లో 951, పాలకొండ డివిజన్‌లో 750 గణేష్‌ మండపాలను నిర్వహించే అవకాశముంది. జిల్లాలో వినాయకుని మండపాల ఉచిత విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సుమారు రూ.50 లక్షలు పైబడి విద్యుత్‌ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:14 AM