Share News

Preparing for DSP exam డీఎస్పీ పరీక్షకు సన్నద్ధం

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:01 AM

Preparing for DSP exam జిల్లాలో డీఎస్సీ పరీక్ష నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 6 నుంచి 30వ తేదీ వరకూ ఈ పరీక్ష జరగనున్నది. నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Preparing for DSP exam డీఎస్పీ పరీక్షకు సన్నద్ధం

డీఎస్పీ పరీక్షకు సన్నద్ధం

రేపటి నుంచి 30 వరకు నిర్వహణ

ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

ఉమ్మడి జిల్లా నుంచి హాజరుకానున్న 36,495 మంది అభ్యర్థులు

గంట ముందు కేంద్రానికి హాజరుకావాలి

హాల్‌టిక్కెట్‌తో పాటు గుర్తింపుకార్డు తప్పనిసరి

విజయనగరం కలెక్టరేట్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో డీఎస్సీ పరీక్ష నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 6 నుంచి 30వ తేదీ వరకూ ఈ పరీక్ష జరగనున్నది. నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌లో విధానంలో ఈ పరీక్ష ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు పూటలా జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల ప్రకారం నిర్వహిస్తున్న పరీక్షకు 36,495 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఐదు కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. నగరంలోని సీతంకాలేజీ, ఐయాన్‌ డిజిట్‌జోన్‌, లెండి ఇంజినీరింగ్‌, ఎంవిజిఆర్‌, అవంతి కళాశాలల్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంట ముందు హాజరుకావాలి. హాల్‌ టిక్కెట్‌తోపాటు తప్పనిసరిగా ఆధార్‌ లేదా ఏదైనా గుర్తింపుకార్డును తీసుకువెళ్లాలి. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ కేటాయించారు.

తప్పులు సరిదిద్దుకొనే అవకాశం: కలెక్టర్‌

డీఎస్సీ హాల్‌ టిక్కెట్‌లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం ఉందని కలెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణపై తన చాంబర్‌లో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏదైనా తప్పు దొర్లితే దానికి సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ను చూపించి జిరాక్స్‌ కాపీని అందజేసి పరీక్ష కేంద్రం వద్ద సరిచేసుకోవచ్చని చెప్పారు. తప్పులు సరిచేయించుకునేవారు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని, నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండాలని, హైస్పీడ్‌ నెట్‌ సదుపాయం ఉండాలని ఆదేశించారు. అభ్యర్థుల కోసం అదనపు బస్సులు నడపాలని ఆర్‌టీసీకి సూచించారు. సమావేశంలో డీఆర్‌వో మురళి, జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:01 AM