Share News

పల్లెపోరుకు సన్నాహాలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:06 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది.

పల్లెపోరుకు సన్నాహాలు
శృంగవరపుకోట మేజర్‌ గ్రామ పంచాయతీ వ్యూ

- ఆశావహుల్లో మొదలైన సందడి

- పదవుల కోసం కూటమి నాయకుల ఆరాటం

- పోటీకి వైసీపీ నేతలు విముఖత

విజయనగరం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ డిసెంబరు నెలాఖరు నాటికి ఓటరు జాబితా సిద్ధం, రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని చూస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసి ముందుగా మునిసిపల్‌, ఆ తరువాత పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి ఎన్నికలను వరుసగా నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సైతం మానసికంగా సిద్ధమవుతోంది. దీంతో జిల్లాలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఏ గ్రామంలో చూసినా.. ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ నడుస్తోంది. పలానా వ్యక్తి సర్పంచ్‌గా నిలబడతాడట, ఎంపీటీసీగా పోటీచేస్తున్నాడట.. ఈసారి జడ్పీటీసీ ఆయనకే? ఎంపీపీగా ఆయనకు మాటిచ్చేశారట! ఇలా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ చోటా నేతల్లో ఎక్కువ సందడి కనిపిస్తోంది.

- 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 27 మండలాల్లో దాదాపు 90 శాతానికిపైగా స్థానాలను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో అయితే అంతా ఏకపక్షమే. చీపురుపల్లి నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాలను ముందుగానే ఏకగ్రీవం చేసుకున్నారు. అప్పట్లో గ్రామ వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఓటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పంచాయతీలను కైవసం చేసుకున్నారన్న విమర్శ ఉంది. అయితే ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే హవా అన్న చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ చోటా నేతలు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. పోటీకి దిగితే లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. గెలుస్తామన్న నమ్మకం లేదు. అందుకే పోటీచేయడం దండగ అని భావిస్తున్నారు. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వారు స్థానిక సంస్థల్లో పదవులు ఆశించకూడదని షరతు పెట్టి చేర్చుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్‌ వస్తామంటే టీడీపీ కేడర్‌ అంగీకరించడం లేదు. అయితే ఎమ్మెల్యేలు చొరవ చూపుతుండడంతో వైసీపీ నేతల చేరికకు మార్గం దొరుకుతోంది.

- ముందుగా మునిసిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2021లో మునిసిపల్‌ ఎన్నికలు జరిగాయి. వాటి పదవీకాలం 2026 మార్చి 17తో ముగియనుంది. మూడు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విజయనగరం నగర పాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మునిసిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. గత ఎన్నికల్లో విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల స్థానాలను వైసీపీ గెలుచుకుంది. రాజాం మునిసిపాలిటీకి ఎన్నిక జరగలేదు. ఈసారి మాత్రం కూటమి పార్టీలకే అధికారం దక్కే అవకాశం ఉంది.

మునిసిపాలిటీ హోదా దక్కేనా?

శృంగవరపుకోట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలోని నాలుగు మేజర్‌ పంచాయతీల స్థాయి పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మునిసిపాలిటీ హోదా కోసం శృంగవరపుకోట, కొత్తవలస, చీపురుపల్లి, గజపతినగరం మేజర్‌ పంచాయతీలు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నాయి. పదేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నాలుగింటినీ పురపాలక సంఘాలుగా మార్చే ప్రయత్నాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన నివేదికలు మునిసిపల్‌ శాఖకు చేరగా ఒక్క నెల్లిమర్లకు మాత్రమే నగర పంచాయతీ హోదా దక్కింది. అయితే, అప్పటికే పంచాయతీ పాలకవర్గం కొలువుదీరి ఉన్నందున అప్పటి సర్పంచ్‌లు పట్టణ హోదాను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ నాలుగు మేజర్‌ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చాలన్న డిమాండ్‌ వచ్చింది. కానీ, జగన్‌ సర్కారు దానిపై శ్రద్ధచూపలేదు. ఏ ప్రభుత్వమైనా ఈ పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చాలని చూస్తే పాలకవర్గ సభ్యులతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు వ్యతిరేకించడం పరిపాటిగా మారింది. మునిసిపాలిటీగా మారితే ఇంటిపన్నులు విపరీతంగా పెరుగుతాయని, తాగునీటికి చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తారని, ఉపాధి హామీ పనులు ఉండవని స్థానిక ప్రజలను నాయకులు భయపెడుతున్నారు. దీంతో మునిసిపాలిటీ హోదాను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చీపురుపల్లి, గరివిడి మేజర్‌ పంచాయతీలతో పాటు చుట్టుపక్కల గ్రామాలను కలిపి ఇరవై ఏళ్ల కిందటే చీపురుపల్లిని అధికారులు నగర పంచాయతీగా చేశారు. దీనిపై వ్యతిరేకత రావడంతో తిరిగి ఆ హోదాను రద్దు చేశారు. అప్పటి నుంచి పట్టణ హోదా ఊసే లేకుండా పోయింది. శృంగవరపుకోట, కొత్తవలస మేజర్‌ పంచాయతీలు జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ విశాఖ మహానగరానికి ఆనుకుని ఉంటాయి. బహుళ అంతస్థుల, వ్యాపార సముదాయాలతో ఇక్కడంతా పట్టణ కల్చరే ఉంటుంది. 50వేలకు పైబడి జనాభా నివశిస్తుంది. కానీ, మునిసిపాలిటీ హోదా మాత్రం దక్కడం లేదు. ప్రస్తుత మేజరు పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 6తో ముగియనుంది. మూడు నెలల ముందే వీటికి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ చూస్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ కమిషనర్లకు ఇప్పటికే లేఖలు పంపించింది. ఈలోగా అర్హత కలిగిన పంచాయతీలను పురపాలక, నగర పంచాయతీలుగా ఉన్నతీకరించడం, పట్టణ స్థానిక సంస్థల్లో పంచాయతీలను విలీనం చేసే నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనని, రిజర్వేషన్లు ఖరారు చేశాకే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఎన్నికల సంఘం చెబుతుంది. దీంతో శృంగవరపుకోట, కొత్తవలస, చీపురుపల్లి, గజపతినగరం మేజర్‌ పంచాయతీలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ అంతటా జరుగుతోంది. గతంలో పాలక వర్గాలు పదవీ కాలంలో ఉంటుండగా మునిసిపాలిటీలుగా మార్చే ప్రయత్నాలు జరగడంతో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. అయితే, ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. పాలక వర్గాల పదవీ కాలం మరో ఆరు నెలల్లో ముగియనున్నందున రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు.

Updated Date - Sep 29 , 2025 | 12:06 AM