విజయనగరం ఉత్సవాలకు సన్నద్ధం
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:04 AM
విజయనగరం ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి ఆదేశించారు.
-కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విజయనగరం ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. ఉత్సవ ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. గత ఏడాది ఏయే కార్యక్రమాలు నిర్వహించారు? ఎంత మొత్తం నిధులు వ్యయం చేశారు వంటి అంశాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిధులు లభ్యతను బట్టి ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. క్రీడలు, సంగీత, సాంస్కృతిక, సైన్స్‌ఫెర్, కవి సమ్మేళనం, జానపద కళాప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, పుష్ప ప్రదర్శన తదితర కార్యక్రమాలు యధావిధిగా నిర్వహించాలన్నారు. ఉత్సవ జీవిత కాలసభ్యులను కూడా ఆహ్వానించి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, జడ్పీ సీఈవో సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య, వ్యవసాయశాఖ ఇన్‌చార్జి జేడీ భారతి తదితరులు పాల్గొన్నారు.