Share News

Expansion విస్తరణకు సన్నాహాలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:08 AM

Preparations for Expansion జిల్లాలో రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు జోరుగా సర్వే పనులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి ఒడిశా రాష్ట్రం రాయగడ వరకు ప్రస్తుతం రెండు వరుసల రహదారులే ఉన్నాయి. త్వరలోనే నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.

 Expansion  విస్తరణకు సన్నాహాలు
పార్వతీపురం-నర్సిపురం ప్రధాన రహదారి ఇలా..

  • నాలుగు లైన్ల నిర్మాణానికి రంగం సిద్ధం

  • శరవేగంగా సర్వే

  • తప్పనున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు

  • మెరుగుపడనున్న రవాణా సౌకర్యం

పార్వతీపురం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు జోరుగా సర్వే పనులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి ఒడిశా రాష్ట్రం రాయగడ వరకు ప్రస్తుతం రెండు వరుసల రహదారులే ఉన్నాయి. త్వరలోనే నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా చిలకపాలెం నుంచి విజయనగరం జిల్లా రామభద్రపురం, బొబ్బిలి మీదుగా మన్యం జిల్లా సీతానగరం, పార్వతీపురం మండలాల మీదుగా జిల్లా కేంద్రం పార్వతీపురం నుంచి రాయగడ వరకు రహదారి విస్తీర్ణం పనులు చేపట్టనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఏడు మీటర్లు బీటీ రహదారి ఉండగా మధ్యలో మూడు మీటర్లు సెంట్రల్‌ డివైడర్స్‌ ఉన్నాయి. కొత్తగా నిర్మించే నాలుగు లైన్ల రహదారుల్లో భాగంగా డివైడర్లు కాకుండా ఇరువైపులా 11 మీటర్ల వరకు బీటీ రోడ్లను ఏర్పాటు చేయనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు.

ఇదీ పరిస్థితి..

- జిల్లా కేంద్రంలో రహదారుల విస్తీర్ణం జరిగితే పరిస్థితి ఏమిటనేది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం పార్వతీపురం పట్టణంలో బైపాస్‌ రహదారి ఉంది. అయితే నాలుగు రోడ్లు రహదారిని బైపాస్‌కు అనుసంధానం చేస్తారా? లేదా! లేక పట్టణ కేంద్రం నడిబొడ్డు నుంచి నాలుగు లైన్ల రహదారులు నిర్మిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. బైపాస్‌ రహదారి గుండా నాలుగు రహదారులు నిర్మిస్తే కొంతవరకు ఇబ్బంది ఉన్నప్పటికీ పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార వర్గాలు, ఎంతోమంది నివాసితులకు ఊరట కలగనుంది.

- గతంలో పార్వతీపురం డివిజన్‌ కేంద్రంగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి ఒకటే ఉండేది. అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టణంలో రహదారుల విస్తీర్ణ పనులు చేపట్టడంతో ట్రాఫిక్‌ సమస్య కొంతవరకు తగ్గింది. జిల్లాకేంద్రంగా ఏర్పడిన తర్వాత పార్వతీపురంలో ట్రాఫిక్‌ రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ రోడ్ల విస్తీర్ణం తప్పనిసరి అయ్యింది. అయితే సర్వే జరిగిన తర్వాత దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

సర్వే జరుగుతుంది

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి రామభద్రపురం వయా రామచంద్రపురం, బొబ్బిలి పార్వతీపురం మీదుగా ఒడిశా రాష్ట్రం రాయగడ వరకు రహదారుల విస్తీర్ణం జరగనుంది. దీనికి సంబంధించి సర్వే జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రహదారుల నిర్మాణాలు ఉంటాయి.

- రాధాకృష్ణ, జిల్లా ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ శాఖాధికారి

Updated Date - Sep 22 , 2025 | 12:09 AM