Preparation for Mahanadu మహానాడుకు సన్నద్ధం
ABN , Publish Date - May 05 , 2025 | 11:33 PM
Preparation for Mahanadu ఎన్టీఆర్ జయంతి(మే28)ని పురస్కరించుకుని ఏటా తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు జిల్లాలోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహానాడుకు సన్నద్ధం
18 నుంచి అన్ని నియోజకవర్గాల్లో సభలు
23 లేదా 24న జిల్లా స్థాయి కార్యక్రమం
తొలిదశ సంస్థాగత ఎన్నికలు పూర్తి
రెండోదశ ప్రక్రియకు రంగం సిద్ధం
విజయనగరం, మే 5 (ఆంధ్రజ్యోతి):
ఎన్టీఆర్ జయంతి(మే28)ని పురస్కరించుకుని ఏటా తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు జిల్లాలోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో సభలు జరుగుతాయి. ఈలోగా గ్రామ, వార్డు, డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే గ్రామ, వార్డు, డివిజన్ స్థాయి టీడీపీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ కమిటీలకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తికావచ్చింది. ఇక రెండోదశ ఎన్నికల్లో భాగంగా నగరం, పట్టణం, మండలంలో టీడీపీ కమిటీలు, అనుబంధ సంఘాలకు సంబంధించి ఏకాభిప్రాయంతో నియామక ప్రక్రియను ఈ నెల 18లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయి నుంచి జిల్లాలకు పరిశీలకులు కూడా రానున్నారు. జిల్లాలో మండలాలు, నగర కమిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ కమిటీ, బొబ్బిలి పట్టణ కమిటీల ప్రక్రియ ఈ నెల 15లోగా పూర్తికానుంది. జిల్లా స్థాయి కమిటీల ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది.
18 నుంచి నియోజకవర్గాల్లో మినీ మహానాడులు
రాష్ట్ర మహానాడుకు ముందుగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిఽధిలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మినీమహానాడులు జరగనున్నాయి. విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 20న మహానాడు జరగనుంది. ఈ మహానాడులో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను చర్చించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను రాష్ట్ర మహానాడుకు నివేదించనున్నారు.
23 లేదా 24న జిల్లా స్థాయి మహానాడు
కడప జిల్లాలో నిర్వహించే మహానాడుకు సన్నద్ధతగా నియోజకవర్గాల్లో మహానాడులు ముగిసిన అనంతరం జిల్లా స్థాయిలో మహానాడు జరగనుంది. ఈ నెల 23న కాని, 24న కాని జిల్లా మహానాడు ఉంటుంది. దీనికి ముందే పార్టీ జిల్లా అధ్యక్షుడ్ని రాష్ట్ర పార్టీ నియమిస్తుంది. కొత్త అధ్యక్షుని హయాంలో జిల్లాస్థాయి మహానాడు జరగనుంది. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున ఉన్నారు. ఆయనను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా నియమించారు. తిరిగి పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగిస్తారా? లేదంటే మరొకరికి అప్పగించనున్నారా? అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
=======