prefor to operation first కాన్పుకొస్తే కోతే!
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:16 AM
prefor to operation first విజయనగరానికి చెందిన ఓ గర్భిణి ప్రారంభం నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. అన్నీ సవ్యంగా ఉన్నాయని సుఖ ప్రసవం ఖాయమని వైద్యులు చెప్పారు. తీరా నెలలు నిండే సమయానికి కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగిందని.. అత్యవసరంగా వైద్యం అందించాలని చెప్పుకొచ్చారు. దీంతో ఆపరేషన్ చేసి ప్రసవం చేయించగా ఐదు రోజుల పాటు ఉంచి రూ.లక్ష బిల్లు వసూలు చేశారు.
కాన్పుకొస్తే కోతే!
జిల్లాలో తగ్గిన సుఖ ప్రసవాలు
74 శాతం సిజేరియన్లే
కొంతమంది కాసుల కక్కుర్తి
శస్త్రచికిత్సల్లో జిల్లాకు ఐదో స్థానం
- విజయనగరానికి చెందిన ఓ గర్భిణి ప్రారంభం నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. అన్నీ సవ్యంగా ఉన్నాయని సుఖ ప్రసవం ఖాయమని వైద్యులు చెప్పారు. తీరా నెలలు నిండే సమయానికి కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగిందని.. అత్యవసరంగా వైద్యం అందించాలని చెప్పుకొచ్చారు. దీంతో ఆపరేషన్ చేసి ప్రసవం చేయించగా ఐదు రోజుల పాటు ఉంచి రూ.లక్ష బిల్లు వసూలు చేశారు.
- విజయనగరానికి చెందిన మరో గర్భిణి స్థానికంగానే ఓ ప్రైవేటు వైద్యురాలి దగ్గర సేవలు పొందుతోంది. ఎనిమిది నెలల పాటు ఆమె వద్ద వైద్య పరీక్షలు చేయించుకుంది. తొమ్మిదో నెల వచ్చాక బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందడం లేదని, ఆపరేషన్ చేయాలని చెప్పింది. చేసేది లేక ఆమె ఆపరేషన్ చేయించుకుంది. ఐదు రోజులు ఆస్పత్రిలో ఉంచి రూ.1.5లక్షల బిల్లు వేశారు.
విజయనగరం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో అసలు ఏ ఆస్పత్రిలో కూడా సుఖ ప్రసవం అన్న మాటేలేదు. అన్నింటికీ ఆపరేషన్లే మందు అన్నట్టు పరిస్థితి మారింది. ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తల్లీబిడ్డలను కాపాడేందుకు మాత్రమే సిజేరియన్లు చేసేవారు. ఇప్పుడు కాన్పు అంటేనే కోత అన్నట్టుగా మారిపోయింది. వివిధ కారణాలు చెప్పి ఆపరేషన్లకు ఒప్పిస్తున్నారు. దండిగా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. సాధారణ ప్రసవానికి రూ.30 వేలు, శస్త్రచికిత్స అయితే రూ.50 వేల నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. మందులతో పాటు గదుల అద్దెలు అదనం. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస స్థాయిలో కూడా ప్రసవాలు జరగడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం లెక్కలేనన్ని జరుగుతు న్నాయి. దేశంలో అత్యధిక శస్త్రచికిత్సలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ మూడోస్థానంలో ఉంది. అదే రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఐదో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 85 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రిలో ఇద్దరు, ముగ్గురు వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆరోగ్య సహాయకులు, ఆశాలు, 108, 104 సిబ్బంది సైతం ఉన్నారు. కానీ సుఖప్రసవాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. అవగాహన పెంచాల్సిన యంత్రాంగం తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది. గత ఏడాది విజయనగరం జిల్లాలోని 30 మండలాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన సుఖ ప్రసవాలు కేవలం 776 మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో 20,272 ప్రసవాలు జరిగాయి. అందులో 14,424 సాధారణ ప్రసవాలు కాగా.. శస్త్రచికిత్సల ద్వారా 5,848 జరిగాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 20,501 జరగగా..11,999 సాధారణ, 8,502 శస్త్రచికిత్సల ద్వారా ప్రసవాలు జరిగాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మూఢ నమ్మకాలతోనూ..
జాతకాలు, ఇతర నమ్మకాలతో కొందరు ముందస్తు ప్రసవాల వైపు మొగ్గుచూపుతున్నారు. సుఖ ప్రసవం కోసం ఎదురుచూడడం లేదు. పలానా రోజు మంచిది అంటూ ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. ఆగస్టు 15, జనవరి 1 వంటి పర్వదినాల నాడు ప్రసవాలు చేయించిన వారూ ఉన్నారు. పెద్దల పేరిట సెంటిమెంట్ అని ఒకరు.. చనిపోయిన పూర్వీకుల పుట్టిన రోజు అని మరొకరు.. ఇలా ప్రతిఒక్కరూ ముందస్తు ప్రసవాలకే మొగ్గుచూపుతున్నారు. అటు కాసుల కక్కుర్తిపడిన వైద్యులు సైతం ప్రసవాలు కోసం వెళుతున్న వారి మైండ్‌లో ఏవేవో ఆలోచనలు చొప్పిస్తున్నారు. దీంతో కుటుంబసభ్యులు సైతం సుఖ ప్రసవాలు అన్న విషయాన్నే మరిచిపోతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వెళుతుంటే ‘రక్తం తగ్గిందని, బిడ్డ ఉమ్మనీరు తాగేసిందని, బరువు ఎక్కువగా ఉందని, రక్తపోటు అధికమైందని, బిడ్డ అడ్డం తిరికిందని’ ఇలా రకరకాల కారణాలు చెబుతూ అమ్మ కడుపు కోసేస్తున్నారు. లక్షల రూపాయల పేరిట ఫీజులు వసూలు చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువగా పేదలు, సామాన్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పేరుకే ప్రభుత్వాస్పత్రుల్లో సుఖ ప్రసవాలని చెప్పుకొస్తున్నారు. దీనిని ప్రచార ఆర్భాటం చేసేశారు.
ఎదుగుదల లేకుండా..
శిశువు శరీరంలో అన్ని అవయవాలు పూర్తిస్థాయిలో వృద్ధి చెందేందుకు 39 వారాల సమయం పడుతుంది. అప్పుడే శిశువు ఆరోగ్యంగా జన్మిస్తుంది. కాగా కొద్ది రోజులు ముందుగానే ప్రసవాలు చేస్తుండడంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. శస్త్రచికిత్స ద్వారా ప్రసవించిన శిశువు బరువు తక్కువగా ఉంటోంది. ఊపిరితిత్తులు సరిగా ఎదగడం లేదని, శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయంటున్నారు. పచ్చకామెర్లతో పాటు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు సైతం సోకుతున్నాయి. ఆ తర్వాత జీవితాంతం రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడే ప్రమాదం ఉంది.
ఇష్టారాజ్యంగా కత్తిగాట్లు..
జిల్లాలో 74 శాతం సిజేరియన్లు జరగటం అందోళన కలిగిస్తోంది. గర్భిణీకి శస్త్రచికిత్స చేస్తే అందుకు గల కారణాలను రిపోర్టులో స్పష్టంగా రాయాలి కానీ అనారోగ్య కారణాలు చూపుతూ ఇష్టారాజ్యంగా శరీరంపై కత్తిగాట్లుపెడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నా.. అత్యవసరమని చెప్పి శస్త్రచికిత్సలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్జరీ చేసి బిడ్డను ప్రమాదకరంగా బయటకు లాగుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో గత మూడేళ్లలో సాధారణ ప్రసవాలు 25 వేలకు మించి జరగలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గర్భిణీని తొలి నుంచి పరిశీలించాలి. ఎప్పటికప్పుడు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పరీక్షలు చేయాలి. ఆశా కార్యకర్తలు నిత్యం పరిశీలించాలి. జిల్లాలో అదెక్కడా జరిగిన దాఖలాలు లేవు. శని, ఆదివారాలు వస్తే చాలూ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు కనిపించడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి పెద్దాస్పత్రులకు రిఫర్ చేయాలి. కానీ అలా జరగడం లేదు. అందుకే చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల ముఖమే చూడడం మానేస్తున్నారు.
తల్లీ బిడ్డకు ప్రమాదం
వీలైనంత వరకూ సుఖ ప్రసవాలు చేయాలి. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఇబ్బందని తెలిస్తేనే ఆపరేషన్లు చేయాలి. ముందస్తు ప్రసవం అనేది తల్లీబిడ్డల అనారోగ్యానికి ఒక హేతువు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.. ముందస్తు ముహూర్తాలు పెట్టుకుని ప్రసవాలు చేయించడం నేరంగా పరిగణిస్తారు. వీలైనంత వరకూ సుఖ ప్రసవాల కోసం ఎదురుచూడాలి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి.
- డాక్టర్ జీవనరాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, విజయనగరం
----------------