Share News

pre meature day నెలలు నిండకున్నా.. కనుపాపలై వెలగాలి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:17 PM

pre meature day కడుపున నలుసుగా పడినప్పటి నుంచే బిడ్డ సంరక్షణపై తల్లి ప్రత్యేక దృష్టి పెడుతుంది. ప్రతి క్షణం ఆలోచిస్తుంది. పసికందు రూపాన్ని ఊహించుకుంటుంది. కలలు కంటుంది. నవమాసాలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుని ఆచరిస్తుంది. అయినా సరే ఒక్కోసారి తల్లి అంచనాలు తప్పుతుంటాయి. అనుకున్న సమయానికి ముందే బిడ్డ కనాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అలాంటప్పుడే మరింత అప్రమత్తం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నేడు వరల్డ్‌ ప్రీ మెచ్యూరిటీ డే పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

pre meature day  నెలలు నిండకున్నా..  కనుపాపలై వెలగాలి

నెలలు నిండకున్నా..

కనుపాపలై వెలగాలి

ముందే పుడుతున్న శిశువులు

వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం

అన్ని సౌకర్యాలు ఉండే ఆస్పత్రిలో చేరితే మరింత సేఫ్‌

నేడు వరల్డ్‌ ప్రీ మెచ్యూరిటీ డే

కడుపున నలుసుగా పడినప్పటి నుంచే బిడ్డ సంరక్షణపై తల్లి ప్రత్యేక దృష్టి పెడుతుంది. ప్రతి క్షణం ఆలోచిస్తుంది. పసికందు రూపాన్ని ఊహించుకుంటుంది. కలలు కంటుంది. నవమాసాలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుని ఆచరిస్తుంది. అయినా సరే ఒక్కోసారి తల్లి అంచనాలు తప్పుతుంటాయి. అనుకున్న సమయానికి ముందే బిడ్డ కనాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అలాంటప్పుడే మరింత అప్రమత్తం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నేడు వరల్డ్‌ ప్రీ మెచ్యూరిటీ డే పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

రాజాం రూరల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి):

నెలలు నిండకుండా శిశువులు జన్మించడం ప్రస్తుత రోజుల్లో సాధారణంగా మారింది. ఈ పరిస్థితిలో వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే మిగతా వారిలా ఆరోగ్యవంతుల వుతారన్నది వైద్యుల మాట. నెలలు నిండకుండా.. అంటే 23, 24, 25 27, 34 ఇలా.. ఆయా నెలల్లో పుట్టే పిల్లలందరినీ ప్రీ మెచ్యూర్‌ బేబీగా పరిగణిస్తారు. 37 వారాల కంటే ముందు పుట్టే పిల్లలు ప్రీమెచ్యూర్‌ కోవలోకి వస్తారు. 28 వారాల లోపు పుట్టే పిల్లలు ఎక్స్‌ట్రీమ్‌ ప్రి మెచ్యూర్‌ కోవకు చెందుతారు. ఇలాంటి శిశువులు పుడుతునే సమస్యలు వెంట తెచ్చుకోవడంతో పాటు ఎదిగే క్రమంలో కూడా ఎన్నోరకాల సమస్యలకు లోనవుతారు. తల్లి గర్భం నుంచి అత్యంత తక్కువ సమయంలోపే బయటపడే ఎక్స్‌ట్రీమ్‌ ప్రి మెచ్యూర్‌ పిల్లలకు సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెలలు నిండకుండా శిశువులు జన్మిస్తే వారు తల్లి నుంచి పొందే సరైన పోషణ కోల్పోతారు. ప్రెగ్నెన్సీ పీరియడ్‌ మొత్తం పూర్తికాకుండా జన్మించిన శిశువులలో న్యూరో డెవలప్‌మెంట్‌ అనేది అసాధారణంగా ఉంటుంది. ఇలాంటి శిశువులు పుట్టిన క్షణాల నుంచి వైద్య సహాయం ఎంతో అవసరం.

ఎందుకిలా..

నెలలు నిండకుండా శిశువు జన్మించేందుకు తల్లి, బిడ్డ.. ఇద్దరిలోనూ లోపం ఉండే అవకాశాలున్నాయి. గర్భిణికి బీపీ, షుగర్‌, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌, మూత్రపిండ ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు ప్రసవానికి ముందే ఉమ్మనీరు కోల్పోయి ప్రసవం కానప్పుడు నెలలు నిండకుండా శిశువుకి జన్మనిచ్చే అవకాశాలే బోలెడని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కృత్రిమ గర్భధారణలో సైతం ఇలాంటి జననాలు సంభవించే అవకాశాలూ లేకపోలేదు. కవల పిల్లలకు జన్మనిచ్చే సమయంలో కూడా నెలలు నిండకుండా శిశువులు పుట్టే వీలుంది.

ఇలా చేయాలి..

నెలలు నిండకుండా పుట్టే శిశువులకు మొదటిగంట కీలకం. పుట్టిన గంటలోపు అన్ని వసతులున్న ఆసుపత్రిలో వైద్యసేవలు అందించగలిగితే త్వరితగతిన కోలుకునే అవకాశాలున్నాయి. రాన్రాను సాధారణ పిల్లల మాదిరిగా ఎదిగే సామర్ధ్యాన్ని సమకూర్చుకోగలుగుతారు. ప్రధానంగా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల్లో ఊపిరితిత్తులు, గుండె, మెదడు, నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థలు పూర్తిగా ఎదగవు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన వెంటనే వెంటిలేటర్‌ సహాయంతో కృత్రిమశ్వాసను అందించాలి. నాడీవ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇంక్యుబేటర్‌ సహాయంతో కృత్రిమ వెచ్చదనాన్ని అందించాలి. పూర్తిస్థాయి ఆరోగ్యం సమకూరేంత వరకు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలి.

కంగారూ మదర్‌కేర్‌ అవసరం

పుట్టినప్పుడు రెండున్నర కిలోల కన్నా తక్కువ బరువున్న శిశువులకు ప్రత్యేకశ్రద్ధ అవసరం. కొంతమంది చిన్నారులు కిలో కన్నా తక్కువ బరువుతో పుడతారు. ఇలాంటి చిన్నారులకు కంగారూ మదర్‌ కేర్‌ చాలా అవసరం. కంగారూ జంతువు ఎలాగైతే తన ఒంటికి హత్తుకుని తన బిడ్డను సంరక్షించుకుంటుందో అదే పద్దతిలో తల్లీబిడ్డల శరీరాలు ఒకరికి ఒకరు తగిలేలా తల్లి స్పర్శను బిడ్డకు అందివ్వగలగాలి. తద్వారా బిడ్డ ఎదుగుదలకు చాలా అవకాశాలున్నాయి.

జాగ్రత్తలు అవసరం

డా.అన్వేష్‌, నియోనటాలజిస్ట్‌, లిటిల్‌ మాస్టర్స్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌

అనారోగ్య సమస్యలున్న గర్భిణులు ఆరోవారం నుంచే అప్రమత్తంగా ఉండాలి. మొదటి ప్రసవం 24 వారాలకు జరిగిపోతే రెండో ప్రసవం అంతకన్నా రెండు వారాలకు ముందే జరిగే అవకాశాలున్నాయి. ఈ కోవకు చెందిన తల్లులు తల్లీబిడ్డలు ఇద్దరికీ అవసరమైన వైద్యసేవలు అందుబాటులో ఉన్న ఆసుపత్రులను ఎంచుకోవాలి. ప్రసూతి వైద్యులతో పాటు పసికందుల వైద్యులున్న ఆసుపత్రిలలో చేరగలిగితే తల్లీబిడ్డా క్షేమంగా ఇళ్లకు చేరవచ్చు.

జాగ్రత్తలు పాటించాలి

డా.కరణం హరిబాబు, చిన్నపిల్లల వైద్యులు, సూపరింటెండెంట్‌, సామాజిక ఆస్పత్రి, రాజాం.

పుట్టిన పిల్లలకు ఆముదం తాగించకూడదు.. పసరమందులు వేయకూడదు. పల్చని పొడిగా ఉన్న దుస్తులు వేయాలి. స్నానం సమయంలో సుగంధ ద్రవ్యాలు వాడకూడదు. తల్లిపాలు తాగించాలి. బాలింతలు పత్యం జోలికి పోకూడదు. వైద్యుల సూచనలు, సలహాలు విధిగా పాటించాలి.

----------------

Updated Date - Nov 16 , 2025 | 11:17 PM