Potholes and damaged railings గుంతలు పడి.. రెయిలింగ్ పాడై
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:38 PM
Potholes and damaged railings ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గ్రామీణ రహదారుల్లో దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు పట్టుతప్పాయి. వాటిపై ప్రమాణం శ్రేయస్కరం కాదు అయినా గతి లేక బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు.
గుంతలు పడి.. రెయిలింగ్ పాడై
ప్రమాదంలో వంతెనలు
దశాబ్దాల కిందట నిర్మించడంతో శిథిలావస్థకు చేరిన వైనం
కాలువలపై ఉన్న రోడ్డు కమ్ కల్వర్టులూ అధ్వానం
ప్రభుత్వం పట్టించుకోకపోతే కష్టమే
- గత నెల 7న సంతకవిటి మండలంలో సాయన్న చానల్‌పై ఉన్న చిన్న వంతెన కూలిపోయింది. కొండగూడెం-ఖండ్యాం మధ్య వంతెన కూలడంతో రేగిడి, సంతకవిటి, బూర్జ మండలాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. రాత్రి సమయంలో కూలడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
- బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూ వస్తోంది. గత ప్రభుత్వంలో నిర్మాణ పనుల్లో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. పాత వంతెన ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూ.13.40 కోట్లు మంజూరు చేసింది. పనులు సకాలంలో పూర్తవుతాయో లేదో చూడాలి.
విజయనగరం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గ్రామీణ రహదారుల్లో దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు పట్టుతప్పాయి. వాటిపై ప్రమాణం శ్రేయస్కరం కాదు అయినా గతి లేక బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్లు, వంతెనలు, కల్వర్టుల నిర్వహణ పడకేసింది. ఆ ప్రభావం ఇప్పుడు పడుతోంది. రాష్ట్రంలోనే వంతెనలు ఎక్కువగా పాడైన జాబితాలో ఉమ్మడి జిల్లా ముందంజలో ఉండడం గమనార్హం. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు, కొన్నింటికి శాశ్వత నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2535 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు విస్తరించి ఉన్నాయి. ఇందులో విజయనగరం జిల్లాకు సంబంధించి 1505.65 కిలోమీటర్లు ఉన్నాయి. అయితే జిల్లాలో ప్రధానంగా నాగావళి, చంపావతి, వేగావతి నదులు ప్రవహిస్తున్నాయి. తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం కాలువలు ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ పరిధిలో గ్రామీణ రహదారులే అధికం. ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువలకు సంబంధించి కల్వర్టులు, వంతెనలు ఉన్నాయి. దశాబ్దాల కాలం నాటివి కావడం, ఎటువంటి నిర్వహణ లేకపోవడంతో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో రాష్ట్రస్థాయి ప్రధాన రహదారులపై 300కుపైగా వంతెనలు, కల్వర్టులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 12 ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. 27 వంతెనలు, కల్వర్టులకు అత్యవసర మరమ్మతులు అవసరం. ఇక జిల్లాలో విజయనగరం-పాలకొండ, విజయనగరం- పార్వతీపురం, విజయనగరం-బొబ్బిలి రోడ్లలో 230 వరకూ వంతెనలు, కల్వర్టులు ఉన్నాయి. అందులో 30 వరకూ అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. తక్షణ మరమ్మతులు అవసరం.
50 ఏళ్లు పైబడినవే అధికం..
సాధారణంగా వంతెనల కాలపరిమితి 40 సంవత్సరాలు. కానీ జిల్లాలో 50 ఏళ్లకు పైబడిన వంతెనలు, కల్వర్టులు అధికంగా ఉన్నాయి. వాటిపై గుంతలు, రెయిలింగ్ పూర్తిగా పాడైనవి ఉన్నాయి. అసలే వాటి పరిస్థితి దయనీయంగా ఉంది. అయినా అత్యధిక బరువుతో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో గృహ నిర్మాణం జరుగుతోంది. వాటికి అవసరమైన నిర్మాణ సామగ్రిని తీసుకెళుతున్న క్రమంలో అధిక బరువుకు వంతెనలు కుంగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో రహదారులు, వంతెనలు, కల్వర్టుల పరిస్థితి తెలుసుకున్నాం. ప్రభుత్వానికి నివేదించాం. అత్యంత ప్రమాదంలో ఉన్న వంతెనలను సైతం గుర్తించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రమాదకర వంతెనల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశాం.
- కాంతిమతి, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ, విజయనగరం