Share News

Poor Panchayats పూర్‌ పంచాయతీలు

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:49 PM

Poor Panchayats శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ పరిధిలో 12 మంది శాశ్వత పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.6.50 లక్షల జీతం పంచాయతీ చెల్లిస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో 36 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.7.80 లక్షల జీతాన్ని అందిస్తోంది. వీరు కాక పారిశుధ్య నిర్వహణలో పాలు పంచుకుంటున్న క్లాప్‌మిత్రలకు రూ.96వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా నెలకు రూ.15.26 లక్షలు చొప్పున ఏడాదికి రూ.1.83 కోట్లును పంచాయతీ వెచ్చిస్తోంది.

 Poor Panchayats పూర్‌ పంచాయతీలు
:శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ కార్యాలయం

పూర్‌ పంచాయతీలు

కుంటుపడుతున్న అభివృద్ధి

పారిశుధ్య కార్మికుల జీతాలకే అధికంగా వెచ్చింపు

అయినా సక్రమంగా అందక ఇబ్బందులు

వారికి 010 పద్దు అమలైతేనే మేలు

పల్లెల్లో మౌలిక వసతులూ కరువు

శృంగవరపుకోట, నవంబరు8 (ఆంధ్రజ్యోతి):

శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ పరిధిలో 12 మంది శాశ్వత పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.6.50 లక్షల జీతం పంచాయతీ చెల్లిస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో 36 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.7.80 లక్షల జీతాన్ని అందిస్తోంది. వీరు కాక పారిశుధ్య నిర్వహణలో పాలు పంచుకుంటున్న క్లాప్‌మిత్రలకు రూ.96వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా నెలకు రూ.15.26 లక్షలు చొప్పున ఏడాదికి రూ.1.83 కోట్లును పంచాయతీ వెచ్చిస్తోంది. పంచాయతీ వార్షిక బడ్జెట్‌ చూస్తే రూ.1.50 కోట్లు. ఈ పరిస్థితిలో ప్రజలకు మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన కష్టమవుతోంది. పారిశుధ్య కార్మికుల వేతనాలకు 010 పద్దు అమలైతేనే పంచాయతీలు పటిష్టమవుతాయి. ఆ వైపుగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సంవత్సరాలుగా డిమాండ్‌ ఉంది.

పంచాయతీలకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా పారిశుధ్య కార్మికుల జీతాలకు ఖర్చు చేయాల్సి వస్తుండడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ సమస్య మేజర్‌ పంచాయతీల్లో మరింత ఎక్కువగా ఉంది. జిల్లాలో శృంగవరపుకోట, కొత్తవలస మేజర్‌ పంచాయతీల్లోనే పారిశుధ్య కార్మికులు అత్యఽధికంగా పని చేస్తున్నారు. ఆ తరువాత చీపురపల్లి, గరివిడి, జామి, రామభద్రపురం మేజర్‌ పంచాయతీల పరిధిలో ఉన్నారు. ఇవన్నీ 10 వేల జనాభా నుంచి 50 వేల జనాభాతో పట్టణ ప్రాంతాలతో పోటీపడుతున్నాయి. వీటికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగం కార్మికుల జీతాలకు చెల్లిస్తున్నప్పటికీ సకాలంలో ఇవ్వడం లేదు. శాశ్వత పారిశుధ్య కార్మికులకు 9 నెలలకోసారి రెండు నెలల జీతాలు, కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు 6నెలలకోసారి రెండు నెలల జీతాలు ఇవ్వగలుగుతున్నారు. క్లాప్‌ మిత్రలకు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. దీంతో పారిశుధ్య కార్మికుల కుటుంబాలు ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నాయి. పంచాయతీల్లో పని చేస్తున్న కార్యదర్శి, ఇతర శాశ్వత ఉద్యోగులకు 010 పద్దు కింద ప్రభుత్వం జీతాలను చెల్లిస్తోంది. కనీసం శాశ్వత పారిశుధ్య కార్మికులకైనా 010 పద్దు కింద ప్రభుత్వం జీతాలను చెల్లించాలని ఇటు పంచాయతీ పాలక మండళ్లు, అటు పారిశుధ్య కార్మికులు చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి డిమాండ్‌ను నెరవేర్చడం లేదు. కాగా నిధుల లేమితో ప్రజలు కోరుకుంటున్న సదుపాయాలను పంచాయతీలు కల్పించలేకపోతున్నాయి. వీటికి ఇంటిపన్ను, రోజువారీ..వారాంతపు మార్కెట్‌ ఫీజు, లైసెన్స్‌ ఫీజు, దుకాణాల అద్దె, ప్రొహిబిషన్‌ ట్యాక్స్‌, స్టాంప్‌ డ్యూటీ వంటి మార్గాల్లో ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయమే పంచాయతీలకు ఊపిరి. వీటి నుంచే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించుకోనేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థిక సంఘ నిధులు ప్రభుత్వం సూచించిన వాటికి మాత్రమే ఖర్చుపెట్టాలి.

ఫ మేజర్‌ పంచాయతీలు, పట్టణాలకు, నగరాలకు సమీపంలో ఉన్న పల్లెలు విస్తరిస్తున్నాయి. శివారుల్లో లేఅవుట్‌లు తీర్చిదిద్దడంతో అవాసాలుగా మారుతున్నాయి. లేఅవుట్‌ వేసే సమయంలో నిబంధనలు పాటించకపోవడంతో వీటిని పంచాయతీలు అభివృద్ధి చేయాల్సి వస్తోంది. పారిశుధ్య నిర్వహణకు అదనంగా కార్మికులను నియమించాల్సి వస్తోంది. అనుబంధంగా రోడ్లు, కాలువలు, విద్యుత్‌, తాగునీరు వంటి సదుపాయాలను కల్పించాలి. పారిశుధ్య కార్మికులకు జీతాల చెల్లింపు బాధ్యత పంచాయతీలకు ఉండడంతో ఆదాయమంతా వారికే సరిపోతోంది. మౌలిక సదుపాయాలకు నిధులు చాలడం లేదు. దీనికితోడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి రావాల్సిన స్టాంప్‌ డ్యూటీ సంక్రమంగా రావడం లేదు. నెలలు కాదు సంవత్సరాల పొడవునా బకాయి ఉంచుతున్నారు. ఏదైనాగాని పారిశుధ్య కార్మికులకు 010 పద్దు ద్వారా ప్రభుత్వం జీతాలు చెల్లింపునకు ముందుకు వచ్చినప్పుడే పంచాయతీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి బాట పడతాయని పాలక మండలి సభ్యులతో పాటు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - Nov 08 , 2025 | 11:49 PM