Pollution కాలుష్య కాటు
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:26 AM
Pollution కాలుష్యం... ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రధాన కారకం. నివారణకు మానవ ప్రయత్నం జరుగుతున్నా అంతకు కొన్ని రెట్లు పెరుగుతోంది. వాయు, జల, భూమి కాలుష్యాలు ఎప్పుడో పరిమితిని మించిపోయాయి. జాతి భవిష్యత్‌ను అయోమయంలో పడేస్తున్నాయి.
కాలుష్య కాటు
కాలుష్యంతో మానవ జీవనానికి విఘాతం
మేల్కొనకుంటే ముప్పే
ముందు జాగ్రత్తలతోనే భవిష్యత్ విపత్తులకు చెక్
నేడు జాతీయ కాలుష్య నివారణ దినం
కాలుష్యం... ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రధాన కారకం. నివారణకు మానవ ప్రయత్నం జరుగుతున్నా అంతకు కొన్ని రెట్లు పెరుగుతోంది. వాయు, జల, భూమి కాలుష్యాలు ఎప్పుడో పరిమితిని మించిపోయాయి. జాతి భవిష్యత్‌ను అయోమయంలో పడేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని, కాలుష్య కారకాలకు దూరంగా జీవనం సాగించేందుకు ప్రయత్నం చేస్తే భవిష్యత్‌లో కరోనా లాంటి విపత్తుల ముప్పు నుంచి బయటపడగలమని వైద్యులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మంగళవారం జాతీయ కాలుష్య నివారణ దినం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
రాజాం, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి):
పరిశుభ్రమైన గాలిని ఆస్వాదిస్తూ ఊపిరి పీల్చాలన్నా, సురక్షితమైన, రుచిగల నీరు తాగాలన్నా, భూమిపై ప్రశాంతంగా నివశించాలన్నా ఇదివరకటి రోజుల్లా ఇప్పుడు సాధ్యం కావడం లేదు. నగరాల్లో ఈ పరిస్థితి మరింత దారుణం. జలం గొంతు దిగుతుంటే కలవరపెడుతోంది. భూమిలో కరగని ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదపుటంచులను తాకుతోంది. పర్యవసానంగా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా లేకపోతే, బంగారు భవిష్యత్ కోసం తలో ప్రయత్నం చేయకపోతే జీవనానికే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ నగరాల జాబితాలో..
జిల్లాలో కూడా కాలుష్యం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్లీయర్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య 122 నగరాలను ఎంపిక చేసింది. అందులో విజయనగరం కూడా ఉండడం కలవర పెడుతోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న వీటి అగ్రహారం, జనాభా అధికంగా ఉన్న కస్పా ప్రాంతంలోని ఉన్నత పాఠశాల, బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లను ప్రత్యేకంగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రతినెలా 9 రోజుల పాటు గాలిలో వాయు కాలుష్య పరిమాణాన్ని పరిశీలిస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం రోజుకు మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ దాటకూడదు. ఏడాదిలో సరాసరి 60 కంటే తక్కువగా ఉండాలి కానీ జిల్లాలో అన్నిచోట్ల 75 నుంచి 77 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
పెరుగుతున్న రుగ్మతలు
జిల్లాలో శ్వాసకోశ వ్యాధులు సైతం పెరుగుతున్నాయి. కాలుష్యమే వ్యాధులకు కారణమని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో ఉండే సూక్ష్మ దూళి, నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, శబ్ధ కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా జిల్లాలో ఆస్తమా, బ్లడ్‌ప్రెజర్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, లంగ్ కేన్సర్ వ్యాధులు క్రమేపీ పెరుగుతున్నాయి. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టకపోతే మాత్రం భవిష్యత్‌లో మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాహన వినియోగంతో..
జిల్లాలో వాహనాల వినియోగం పెరిగింది. ఈ కారణంగానే వాయు కాలుష్యం మరింత పెరిగింది. 15 లక్షల నుంచి 18 లక్షల వరకూ వాహనాలు ఉన్నాయి. అందులో ఐదు లక్షల వరకూ కాలం చెల్లినవే. వీటిని రహదారులపై తిప్పడం ఎంతమాత్రం మంచిది కాదు. అయినా సరే ఈ వాహనాల విషయంలో పోలీస్, రవాణా శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. మరోవైపు వాహనదారులు సైతం విధిగా తమ వాహనాలకు కాలుష్య నిర్ధారణ పరీక్షలు జరుపుకోవడం ఉత్తమం. కానీ నిర్ధిష్ట కాలంలో వాహనాలకు పరీక్షలు చేయడం లేదు. ఇటీవల గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఎలక్ర్టిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ శ్రేణి వాహనాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడం చాలా ఉత్తమం.
నియంత్రించే మార్గాలివే..
కాలుష్య నియంత్రణకు ప్రధానంగా మొక్కల పెంపకం, చెట్లను సంరక్షించడం ఉత్తమం. జిల్లాలో ఏటా ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటుతున్నారు. వాటి సంరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ అవేవీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. యంత్రాంగం బాధ్యతగా దీనిని చేపట్టడం లేదు. జిల్లాలో విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు ఉన్నాయి. నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు 12 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. 777 పంచాయతీలున్నాయి. వీటిలో మొక్కలు నాటడమే కాదు. సంరక్షించే బాధ్యతలు తీసుకుంటే జిల్లాలో కాలుష్యాన్ని నియంత్రణలో తీసుకురావవచ్చు.
- వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. ప్రజారవాణాకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ వెహికల్స్‌ను మాత్రమే వినియోగించడం ఉత్తమం. కాలం చెల్లిన వాహనాలను వాడకూడదు.
- మితిమీరిన ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట పడకపోతే మానవాళికి ప్రమాదకరం. ఉదయం దైనందిన జీవితం మొదలు రాత్రి వరకూ ప్లాస్టిక్ వినియోగాన్ని సమూలంగా నియంత్రించాలి. మునిసిపాల్టీలు, పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణను సరిగ్గా చేయాలి. స్థానిక సంస్థలు దానిని ఒక బాధ్యతగా చేపట్టాలి.
- విద్యుత్‌తో పాటు ఇతర శక్తి వనరులు పొదుపు చేయాలి. ఎల్‌ఈడీ లైట్లను మాత్రమే వినియోగించాలి. ఎనర్జీ ఎఫిషియంట్ ఉపకరణాలను మాత్రమే వాడాలి.
- నీటిని పొదుపుగా వాడాలి. జల కాలుష్యాన్ని తగ్గించాలి. అది కావాలంటే ముందుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ప్రజా సహకారంతోనే నివారణ
కాలుష్యం నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పటికే కాలుష్య నియంత్రణకు సంబంధించి తనిఖీలు చేపడుతున్నాం. అవగాహన కార్యక్రమాలు పెంచాం. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నాం. నిబంధనలు పాటించని పరిశ్రమలు, సంస్థలపై చర్యలు తీసుకుం టున్నాం. ప్రజల సహకారంతోనే కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
- సరిత, జిల్లా కాలుష్య నియంత్రణ అధికారి, విజయనగరం
-----------------