police అమ్మో...పోలీస్!
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:58 PM
police శృంగవరపుకోట పట్టణ శివారులో గురువారం ఎనిమిది ప్రాంతాల్లో ఆరుగురు ఎస్‌ఐలు, 32మంది పోలీస్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేని మూడు వాహనాలు, అర్హత లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు మైనర్లను, తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో వేసిన జరిమానాలను చెల్లించని యజమానుల నుంచి 140 చలానాలను కట్టించారు.
అమ్మో...పోలీస్!
పెరిగిన నిఘా
విస్తృతంగా డ్రోన్ వినియోగం
తనిఖీల్లో పట్టుబడుతున్న రికార్డులు లేని వాహనాలు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే అంతే
- శృంగవరపుకోట పట్టణ శివారులో గురువారం ఎనిమిది ప్రాంతాల్లో ఆరుగురు ఎస్‌ఐలు, 32మంది పోలీస్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేని మూడు వాహనాలు, అర్హత లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు మైనర్లను, తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో వేసిన జరిమానాలను చెల్లించని యజమానుల నుంచి 140 చలానాలను కట్టించారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. మైనర్స్‌కు సీఐ వర్రి నారాయణముర్తి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు.
- శృంగవరపుకోట పట్టణ పరిధిలో శుక్రవారం పోలీస్‌లు డ్రోన్ కెమెరాను ఎగురవేశారు. శివరామరాజు పేట రోడ్డు సమీపంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులను గుర్తించారు. అక్కడకు వెళ్లి మద్యం తాగుతున్నవారిని పట్టుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. ఇదే విధంగా డ్రోన్ కెమెరా సహకారంతో తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
శృంగవరపుకోట, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి):
ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు పెంచింది. డ్రోన్ కెమెరాను కూడా విస్తృతంగా వినియోగిస్తోంది. గంజాయి, మత్తు పదార్థాలను సేవించే అసాంఘిక శక్తులు పట్టుబడకపోయినప్పటికీ బహిరంగంగా మద్యం సేవిస్తున్నవారు, తాగి వాహనం నడుపుతున్నవారు, పేకాట ఆడుతున్నవారు, అర్హత లేకుండా వాహనాలను నడుపుతున్న మైనర్లు మాత్రం దొరుకుతున్నారు. దీంతో ఏ రోడ్డులో పోలీస్‌లు వాహన తనిఖీలు చేపడుతున్నారో, డ్రోన్ కెమెరాలెక్కడ ఎగరేస్తున్నారోనన్న భయం వీరికి పట్టుకుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. ప్రధానంగా మత్తుపదార్థాల తరలింపు, విక్రయాలు, సేవించడం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. జిల్లాలో గంజాయి రవాణా అత్యధికంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. దీంతో కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వ్యాపారుల ఆస్తుల జప్తు, పీడీ యాక్టు ప్రయోగం వంటి చర్యలకు దిగింది. అయితే పోలీస్ తనిఖీల్లో ఎక్కువగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నవారు, అర్హత లేకుండా వాహనాలను తీస్తున్నవారు పట్టుబడుతున్నారు. డ్రోన్ కెమోరాలకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్నవారు, పేకాట అడుతున్నవారు కనిపిస్తున్నారు. వీరితోనూ సమాజానికి నష్టం ఏర్పడుతుండడంతో అదుపులోకి తీసుకుని కోర్టుకు అప్పగిస్తున్నారు. న్యాయాధికారులు కూడా జరినామాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సగానికి పైగా తాగి వాహనం నడుపుతున్నవారితోను, మైనర్‌లు డ్రైవింగ్ చేయడంతో జరుగుతున్నవే. ఇక పేకాటతోనూ కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవారున్నారు. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసేస్తున్నారు. ఆత్మహత్యలు, హత్యలకు ప్రేరేపిస్తున్నారు. ఇవన్నీ శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమిస్తున్నందున జిల్లా పోలీస్ శాఖ వాటిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. డిసెంబర్ 31న కొత్తసంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు యువత వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటుంది. వారంతా పోలీస్ డ్రోన్ నిఘా గురించి తెలిసి కాస్త తగ్గే అవకాశం ఉంది.