Share News

Pola Padayami భక్తిశ్రద్ధలతో పోలి పాడ్యమి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:26 AM

Pola Padayami Observed with Devotion and Reverence జిల్లావాసులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో పోలిపాడ్యమిని జరుపుకున్నారు. కార్తీకమాసం ముగింపు కావడంతో వేకువజామునే నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. అనంతరం ఆలయాలకు చేరుకున్నారు. శివ‌య్య‌కు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు.

Pola Padayami  భక్తిశ్రద్ధలతో పోలి పాడ్యమి
తోటపల్లి నాగావళి నదీ తీర ప్రాంతంలో దీపాలు విడిచిపెడుతున్న భక్తులు

  • కిటకిటలాడిన ఆలయాలు

  • ముగిసిన కార్తీకమాసం

గరుగుబిల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో పోలిపాడ్యమిని జరుపుకున్నారు. కార్తీకమాసం ముగింపు కావడంతో వేకువజామునే నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. అనంతరం ఆలయాలకు చేరుకున్నారు. శివ‌య్య‌కు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు కిటకిటలాడాయి. పరిసర ప్రాంతాల నుంచి తెల్లవారు జామునే పది వేలకు పైగా తరలివచ్చిన భక్తులు నాగావళి నదిలో దీపాలు విడిచిపెట్టారు. దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్‌, ఆలయ ప్రధాన అర్చకులు వీవీ అప్పలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నదికి పంచ హారతులు ఇచ్చారు. మొత్తంగా తోటపల్లి ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఇదిలా ఉండగా నదీ లోపలకు ఎవరూ వెళ్లకుండా ఎస్‌ఐ ఫకృద్ధీన్‌తో పాటు పలువురు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌ బోటు రోప్‌తో పాటు పలు రకాల సామగ్రిని సిద్ధం చేశారు. భక్తులకు సాఫీగా స్వామివారి దర్శనమయ్యేలా చూశారు. మరోవైపు రావివలస, గరుగుబిల్లి పీహెచ్‌సీ వైద్య సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాదాలతో పాటు అన్నసమారాధన నిర్వహించారు. అధికారులతో పాటు సుమారు 300 మందికి పైగా స్వామివారి సేవకులు, జట్టు సంస్థ , దేవస్థానం సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టారు.

Updated Date - Nov 22 , 2025 | 12:26 AM