PMAY-G పీఎంఏవై-జీ గడువు పెంపు
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:53 AM
PMAY-G Deadline Extension ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ - గ్రామీణ్ (పీఎంఏవై-జీ) పథకానికి ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు చేపట్టేందుకు మరో అవకాశం కల్పించారు.
లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు
గరుగుబిల్లి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ - గ్రామీణ్ (పీఎంఏవై-జీ) పథకానికి ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు చేపట్టేందుకు మరో అవకాశం కల్పించారు. వాస్తవంగా గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకొచ్చేందుకు ఈ నెల 5 వరకు గడువు ఇచ్చారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల వివరాలు నమోదు చేశారు. సోమవారం నాటికి 15 మండలాల పరిధిలో 463 మందిని మ్యాపింగ్ చేశారు. ఇందులో 327 మంది ఈకేవైసీ నిర్వహించారు. మరో 136 మందికి ఈకేవైసీ నిర్వహించాల్సి ఉంది. మొత్తంగా జిల్లాలో 5,683 మందికి గాను 4,937 మంది లబ్ధిదారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. అయితే గ్రామస్థాయిలో అనుకున్న మేర లక్ష్యాలను చేరుకోకపోవడంతో మరోసారి గడువు పొడిగించారు. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత సచివవాలయాల పరిధిలోని సిబ్బంది ఆవాస్ యాప్‌లో నమోదు చేయనున్నారు. లబ్ధిదారులకు కేంద్ర, రాష్ట్ట్ర ప్రభుత్వాలు రూ. 1.80 లక్షలు మంజూరు చేయనుంది. అయితే నిధులు చాలకపోవడంతో చాలామంది వెనుకంజ వేస్తున్నారు. సాయం మొత్తం పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఆదేశాలు అందాయి
గృహ నిర్మాణాలకు సంబంధించి గడువు పెంపుపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని ఎంపీడీవో జి.పైడితల్లి, గృహ నిర్మాణశాఖ జేఈ వి.అఖిల్ సోమవారం తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై అవసరమైన అవగాహన కల్పిస్తున్నామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.