grievances సమస్యలు తెలియజేయండి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:00 AM
Please share your grievances తుఫాన్ కారణంగా ఎక్కడ ఎంత చిన్న సమస్య తలెత్తినా తమ దృష్టికి తేవాలని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవ్‌రెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ కారణంగా ఎక్కడ ఎంత చిన్న సమస్య తలెత్తినా తమ దృష్టికి తేవాలని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవ్‌రెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ కలెక్టర్లు మంగళవారం ముంపు ప్రభావత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. రహదారులపై చెట్టు కొమ్మలు పడితే తక్షణమే వాటిని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. బోట్లు సిద్ధం చేసుకోవాలని, రాత్రివేళల్లో రహదారి ప్రమాదాలకు అవకాశం ఉన్న చోట్ల ప్రజలను అలర్ట్ చేయాలని తెలిపారు. గ్రామంలో ఏదైనా జరిగితే వెంటనే గుర్తించి స్థానిక నాయకులు, యువత ద్వారా సమాచారం సేకరించాలన్నారు. పోలీస్ అధికారి, ఎంపీడీవో, తహసీల్దార్ ఒక్కచోటే ఉండాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. గూగుల్ లొకేషన్ ద్వారా కాజ్‌వేలు, కల్వర్టులకు లింక్ చేసుకోవాలని, ముంపు ప్రాంతాలను సర్వే చేసి నివేదిక అందించాలని సూచించారు. పురాతన, శిథిల భవనాలను గుర్తించి ఎవరూ లేకుండా చూడాలని, ప్రజల నుంచే వచ్చే ఫోన్లకు స్పందించాలని ఆదేశించారు. తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వసతిగృహాలు, పాఠశాలలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీకి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రక్షిత పథకాలను నీటితో నింపి ఉంచాలని, వసతిగృహాల్లో విద్యార్థులను బయటకు రాకుండా చూడాలని సూచించారు. సచివాలయ పరిధిలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి తదితరులు పాల్గొన్నారు.