Share News

Please Make a Mention! ప్రస్తావించండి.. ప్లీజ్‌!

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:04 AM

Please Make a Mention! ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే.. జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యేల చొరవతో నియోజకవర్గాల సమస్యలు సైతం పరిష్కారం అవుతున్నాయి. అయితే శాశ్వత సమస్యల పరిష్కారంలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. కీలకమైన ప్రాజెక్టుల పనులు, పారిశ్రామికీకరణ జరగడం లేదు.

Please Make a Mention!  ప్రస్తావించండి.. ప్లీజ్‌!

  • మంత్రి, ఎమ్మెల్యేలపై కొండంత ఆశలు

  • జిల్లాలో సమస్యలెన్నో..

  • పరిష్కార మార్గం చూపాలని ప్రజల విన్నపం

పార్వతీపురం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే.. జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యేల చొరవతో నియోజకవర్గాల సమస్యలు సైతం పరిష్కారం అవుతున్నాయి. అయితే శాశ్వత సమస్యల పరిష్కారంలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. కీలకమైన ప్రాజెక్టుల పనులు, పారిశ్రామికీకరణ జరగడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జిల్లా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తారని ఎమ్మెల్యేలపై జిల్లా వాసులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీలో గళం వినిపించాలని, సాధ్యమైనన్ని నిధులు మంజూరయ్యేలా చొరవ ప్రదర్శించాలని కోరుతున్నారు.

ప్రధాన సమస్యలివీ..

- జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంది. స్థానిక వనరులను ఉపయోగించుకుని ఆ ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీటితో పాటు పార్వతీపురం పట్టణవాసులుకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ , పెదంకలం, వట్టిగడ్డ ప్రాజెక్టుల ద్వారా శివారు భూములకు నీరు అందించాలి.

- గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కురుపాంలో ప్రారంభమైన గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల పనులు పూర్తికాలేదు. ఈ కళాశాల నిర్మాణం పూర్తి చేసి గిరిజన విద్యార్థులకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. కొమరాడ మండలంలో పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు శరవేగంగా పూర్తి చేయించాలి.

- జిల్లాకు పీపీపీ పద్ధతిలో మంజూరైన మెడికల్‌ కళాశాలకు సంబంధించి స్థల సేకరణతో పాటు భవన నిర్మాణాలు ప్రారంభించాలి. వచ్చే విద్యా సంవత్సరానికి వైద్య విద్యార్థులకు దాన్ని అందుబాటులోకి తేవాల్సి ఉంది.

- తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేస్తే వేలాది ఎకరాలకు నీరు అందుతుంది.

- గిరిజన గర్భిణుల వసతిగృహాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కొన్ని నెలలుగా బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి.

- పార్వతీపురం, సీతంపేటలో నిర్మిస్తున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలపై దృష్టి సారించాల్సి ఉంది. జిల్లా కేంద్ర ఆసుప్రతితో పాటు సీతంపేట, పాలకొండ, సాలూరు ఏరియా ఆసుప్రతుల్లో గుండె, ఇతర ప్రత్యేక వైద్య నిపుణులను నియమించాలి.

- జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూర్చాలి. అనేక శాఖలకు ఉన్నతాధికారులను నియమించాలి.

-జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 300పైగా రహదారులను నిర్మించాల్సి ఉంది. అటవీశాఖతో ఉన్న వివాదాన్ని పరిష్కరించి.. గిరిజ నులకు డోలీలు మోతలు తప్పించాలి.

- సాలూరులో మహిళా కళాశాల ఏర్పాటు చేస్తామని గత వైసీపీ సర్కారు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి.

- జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించాలి.

- మన్యాన్ని పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. దీనివల్ల యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపాలి.

Updated Date - Sep 18 , 2025 | 12:04 AM