ఆదుకోండయ్యా!
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:16 PM
Please Help జిల్లాలో పలువురు వితంతువులు నూతన పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడెనిమిది నెలల్లో భర్తను కోల్పోయిన వారు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని వెల్ఫేర్ అసిస్టెంట్లు చెప్పడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం స్పౌజ్ కోటా కింద ఇస్తున్నట్లుగానే తమకూ పింఛన్లు మంజూరు చేయాలని వారు వేడుకుంటున్నారు.
గత ఏడు నెలలుగా పనిచేయని వెబ్‌సైట్
ఇబ్బందుల్లో వందలాదిమంది
ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు
జియ్యమ్మవలస, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలువురు వితంతువులు నూతన పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడెనిమిది నెలల్లో భర్తను కోల్పోయిన వారు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని వెల్ఫేర్ అసిస్టెంట్లు చెప్పడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం స్పౌజ్ కోటా కింద ఇస్తున్నట్లుగానే తమకూ పింఛన్లు మంజూరు చేయాలని వారు వేడుకుంటున్నారు. వాస్తవంగా జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 1,40,073 మందికి పింఛన్లు అందుతున్నాయి. వారిలో వృద్ధులు, నేత కార్మికులు, దివ్యాంగులు , వితంతువులు ((స్పౌజ్ కోటా), కల్లు గీత కార్మికులు, ట్రాన్స్ జెండర్స్ , మత్స్య కారులు , ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టేవారు, డప్పు వాయించేవారు, కళాకారులు , కిడ్నీ బాధితులు తదితరులు ఉన్నారు. పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ. 59.84 కోట్లు మంజూరు చేస్తోంది. కాగా ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ మంజూరు చేయాలని వితంతువులు సచివాలయాలకు వెళ్తే ఆన్‌లైన్ సైట్ పూర్తిగా క్లోజ్ చేసేశారని అక్కడున్న సిబ్బంది చెబుతున్నారు. దీంతో వారు ఈసురోమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే వెంటనే ఆయన భార్యకు (స్పౌజ్) పింఛన్ మంజూరు చేస్తున్నారు. కానీ వితంతు వులకు మాత్రం పింఛన్ మంజూరుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జియ్యమ్మవలస మండలం పెదతోలుమండ పంచాయతీ లోని పీటీ మండ, చాపరాయిగూడ, దీసరిగూడ, బాపన్నగూడ, నడిమిసిరిపి, పల్లపుసిరిపి గిరిజన గ్రామాల్లో దాదాపు 30 మంది వితంతువులకు పింఛన్లు రాలేదు. చినమేరంగిలోని దళితవాడలో నలుగురు , కొండచిలకాం , అలమండ, టీకే జమ్ము పంచాయతీల్లో సుమారు 50 మంది వరకు వితంతువులకు పింఛన్లు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో వందలాది మంది అర్హులైన వితంతువులు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఆదేశాలిస్తే చర్యలు తీసుకుంటాం
వితంతు పింఛన్ల మంజూరు విషయంలో ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. ఉత్తర్వులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
- సుధారాణి, డీఆర్‌డీఏ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా