Three Crops in a Year ఏడాదిలో మూడు పంటలకు ప్రణాళికలు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:19 AM
Plans for Three Crops in a Year జిల్లాలో రైతులు ఏడాదిలో మూడు పంటలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా వాణిజ్య పంటలపై దృష్టిసారించేలా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు ఏడాదిలో మూడు పంటలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా వాణిజ్య పంటలపై దృష్టిసారించేలా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ప్రతి అర్జీకి ఎండార్స్‌మెంట్ చేయాలన్నారు. ఆర్థిక, ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. మీడియాలో వచ్చే వార్తలపై జిల్లా అధికారులు స్పందించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె.హేమలత , ప్రత్యేక ఉప కలెక్టర్ దిలీప్‌చక్రవర్తి, డీఎంహెచ్‌వో భాస్కరరావు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్
రెవెన్యూ సమస్యలపై ప్రతి గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామస్థాయి అధికారులు గ్రీవెన్స్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా ఫిర్యాదులను పీజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ను చేపట్టాలని సూచించారు. రెవెన్యూ కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసి పరిష్కార మార్గం చూపాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రాకుండా చూడాలన్నారు.
అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ
నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అక్టోబరు 6 లోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. తిరుపతి, విశాఖలో శిక్షణ ఉంటుందని, ఈ కాలంలో అభ్యర్థులకు ఉచిత, వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారని పేర్కొన్నారు. ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారని, జిల్లా కేంద్రాల్లో అక్టోబరు 12న స్ర్కీనింగ్ టెస్ట్ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ 99496 86306 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.