Rabi Crops రబీ పంటలకు ప్రణాళికలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:07 PM
Plans for Rabi Crops రబీలో పంటలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రకృతి సాగుచేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రజా భాగస్వామ్యంతో ప్రకృతి సాగుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రబీలో పంటలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రకృతి సాగుచేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రజా భాగస్వామ్యంతో ప్రకృతి సాగుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరితో పాటు లాభదాయక ఉద్యాన పంటలను వేసుకో వాలని సూచించారు. అవకాశం మేరకు రైతులు అంతర పంటల వైపు మొగ్గుచూపాలన్నారు. గ్రామాల్లో ఉన్న చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెరువుల అభివృద్ధికి నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలో విశేష కృషి చేసిన రైతులను సత్కరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లాటరీ విధానంలో బార్ కేటాయింపు
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాటరీ తీసి జిల్లాకు ఒక బార్‌ను కేటాయించారు. ఈ బార్‌కు నాలుగు దరఖాస్తులు రాగా మొత్తంగా రూ.20.4 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కాగా సాలూరుకు చెందిన ఆర్.నరేష్ ఈ లాటరీలో బార్‌ను దక్కించుకున్నట్లు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాధుడు తెలిపారు.
స్వమిత్వతో కచ్చితమైన భూ రికార్డులు
పార్వతీపురం రూరల్: స్వమిత్వ సర్వేతో కచ్చితమైన భూ రికార్డులు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్పష్టమైన ఆస్తి యాజమాన్య డేటా అందుబాటులో రానుందని వెల్లడించారు. లక్ష్మీపురంలో అమలవుతున్న స్వమిత్వ యోజన పథకాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. గ్రామస్థులతో మాట్లాడి స్వమిత్వ సర్వేపై అవగాహన కల్పించారు. గ్రామీణ ఆర్థిక ప్రగతి పెంపొందించాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ట్రిపుల్ ఆర్ కింద ప్రతిపాదనలు పంపిన జమదాలలోని ఎర్రనాయుడు చెరువును పరిశీలించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.