Share News

గడువులోగా వినతులు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:56 PM

పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు.

 గడువులోగా వినతులు పరిష్కరించాలి
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

- కలెక్టర్‌ అంబేడ్కర్‌

- పీజీఆర్‌ఎస్‌కు 190 అర్జీలు

విజయనగరంకలెక్టరేట్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి 190 వినతులు వచ్చాయి. వీటిని కలెక్టర్‌ అంబేడ్కర్‌, డీఆర్వో శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీల గాంధీ, విజయనగరం ఆర్డీవో సవరమ్మ స్వీకరించారు. రెవెన్యూ సమస్యలపై 68, పంచాయతీరాజ్‌శాఖ సమస్యలపై 12, పింఛన్ల కోసం 21, మునిసిపాల్టీ 2, విద్యాశాఖకు సంబంధించి 28 వినతులు, మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించి వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులను లాగిన్‌లో ఎప్పటికప్పుడు చూడాలన్నారు. ఎప్పుడు చూసినా జీరో కన్పించాలని అన్నారు. గడువులోగా అర్జీదారులకు సమాధానం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత సీట్లను కేటాయించాలి

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఉచిత సీట్లు ఇవ్వడం లేదని పలువురు తల్లిదండ్రులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లను ఉచితంగా పేదలకు కేటాయించాల్సి ఉందన్నారు. కానీ, విజయనగరంలోని పోర్టు సిటీ, సన్‌ స్కూల్‌, బీసెంట్‌, చాణిక్య పాఠశాలల్లో ఇంకనూ సీట్లు కేటాయించలేదన్నారు. ఈ నాలుగు పాఠశాలల ద్వారా 240 సీట్లు పేదలకు కేటాయించేలా ఆదేశాలు జారీచేయాలని డీఈవో మాణిక్యం నాయుడును ఆదేశించారు.

పింఛన్‌ను పునరుద్ధరించాలి

నేను గత 20 ఏళ్ల నుంచి వితంతు పింఛన్‌ను తీసుకునేదాన్ని. గత వైసీపీ ప్రభుత్వ హయంలో వలంటీర్లు వితంతు బదులుగా వృద్ధాప్యం అని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వారు చేసిన తప్పు వల్ల 2023 నుంచి నాకు పింఛన్‌ డబ్బులు అందడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. వెంటనే పింఛన్‌ను పురుద్ధరించి ఆదుకోవాలి.

- షేక్‌ ఆమీన్‌, తోటపాలెం, విజయనగరం

నడవలేక పోతున్నా..

నేను ఆరు నెలల కిందట వ్యవసాయ పనులకు వెళ్లాను. అడవి పందిని చంపేందుకు కొందరు బాంబు పెట్టారు. ఆ బాంబు పేలడంతో రాళ్లు తగిలి నా కాలుకు బలమైన గాయమైంది. అప్పట్లో కాలుకు ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకు ఇబ్బంది వస్తుంది. వెంటనే పింఛన్‌ మంజూరు చేయాలి

- బర్ల లక్ష్మి, కాటికాపల్లి, కొత్తవలస

Updated Date - Jun 16 , 2025 | 11:56 PM