Share News

చిత్తశుద్ధితో అర్జీలు పరిష్కరించాలి

ABN , Publish Date - May 13 , 2025 | 12:24 AM

ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ జిల్లా అధికా రులను ఆదేశించారు.

చిత్తశుద్ధితో అర్జీలు పరిష్కరించాలి

  • కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

  • పీజీఆర్‌ఎస్‌కు 92 వినతులు

పార్వతీపురం, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ జిల్లా అధికా రులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 92 మంది అర్జీదారు ల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ కార్యక్ర మంలో జేసీ శోభిక, ఐటీడీఏ పీవో అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మాచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి పాల్గొని, వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అర్జీని పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీలు మళ్లీ రీఓపెన్‌ అయ్యే పరిస్థితి ఉండరాదన్నారు.

విజ్ఞప్తులు ఇలా..

జియమ్మవలస మండలం డంభద్ర నుంచి దొనక లక్షుం అర్జీని అందిస్తూ తన తండ్రికి ఇచ్చిన డీపట్టా భూమిలోని కొంత స్థలం ఆక్రమణకు గురైందని, తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. సాలూరు మండలం ఎం.ఎం.గాదిపల్లివలస నుంచి సీహెచ్‌ గంగులు దరఖాస్తు అందిస్తూ తన భూమిని ఇతరులు విక్రయించారని, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలన్నారు. పాలకొండ నుంచి కె.వీరభద్రరావు వినతిపత్రాన్ని అందిస్తూ తాను అవుట్‌సోర్సింగ్‌ శానిటేషన్‌ వర్కర్‌గా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడ్డానని, హైకోర్టులో కేసు ఉందని, తీర్పు రాకముందే ఆ పోస్టును భర్తీ చేస్తున్నారన్నారు. తీర్పు వచ్చే వరకు నిలుపుదల చేయాలని కోరారు. ఇలా పలువురు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నగర పంచాయతీలో లోపాలపై ఫిర్యాదు

పాలకొండ/ బెలగాం: నగర పంచాయతీలో లోపాలపై సామాజిక కార్యకర్త దుంపల రమేష్‌ బాబు(చిన్ని) కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డికి సోమవారం వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారితో దుంపల రమేష్‌ బాబు మాట్లాడుతూ సిల్ట్‌ క్లియరెన్స్‌ మీద అవినీతి జరిగిందని, ఆరోపణలు వచ్చినా విచారణ జరగలేదన్నా రు. విచారణ జరిపించాలని కోరారు. అలాగే పాలకొండ నగర పంచాయతీలో అడ్డుగోలుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు నియామకం అవుతున్నాయని, దీనిపై విచారణ చేపట్టాలన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:24 AM